సర్వేలతో కేసీఆర్ కుటుంబంలో అభద్రతాభావం!

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి వివిధ సర్వేల నివేదికలు ప్రతికూలంగా ఉంటూ ఉండడంతో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకుల్లో అభద్రతాభావంతో ఉన్నారని కేంద్ర మంత్రి జి.  కిషన్ రెడ్డి తెలిపారు.  సర్వేలన్నీ వ్యతిరేకంగా మారడంతో కేసీఆర్ అవినీతికి, తెలంగాణా సెంటిమెంట్ కి ముడిపెట్టి టీఆర్ఎస్ లబ్ది పొందాలని చూస్తోందని చెప్పారు. 
 
రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతు బంధు నుంచి దళిత బంధు వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ నాయకుల కనుసైగల్లో,  వారి అకౌంట్లలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని ఆరోపించారు.
 బీజేపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే గల్లీ నుంచి ప్రగతి భవన్ వరకు విమర్శల దాడులుచేస్తూ, పరుష పదజాలం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్లు అన్ పార్లమెంటరీ భాష వాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసింది ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే కాదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  వందల మంది విద్యార్థులు బలిదానం చేస్తే, సకల జనులు సమ్మె చేస్తే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు.
జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు పోరాడితే పార్లమెంటులో బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ సాకారం అయిందని  కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. రాష్ట్ర అభివృద్ధి నిధులలో కేంద్ర రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. పంజాబ్ రైతు పోరాట మృతులకు పరిహారమిస్తున్న కేసీఆర్ తెలంగాణా ఉద్యమ త్యాగధనులకు ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రజాకంటక పాలన పై బీజేపీ ఉద్యమాలు కొనసాగుతాయని చెబుతూ తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీ తోనే సాధ్యమని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలనపై రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.