‘హనుమాన్‌ చాలీసా’ చాలెంజ్‌ లో ఎంపీ నవనీత్‌కు నోటీసులు

మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలకు కూడా నోటీసులు అందించారు.  నవనీత్ తన భర్త ఎమ్మెల్యే రవి రానాతో కలిసి శనివారం (నేడు) మహారాష్ట్ర సిఎం నివాసం ఎదుట సుదీర్ఘ హనుమాన్ చాలీసా పఠనానికి సంకల్పించడంతో ముంబై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. 
 
శుక్రవారం ఉదయం ముంబై నగరం చేరుకున్న రానా దంపతులు..  ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. వాళ్ల సవాల్‌ నేపథ్యంలో ముంబైకి శివసేన కార్యకర్తలు, ప్రత్యేకించి మాతోశ్రీ దగ్గర గుమిగూడారు. ఈ నేపథ్యంలో,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం కింద వాళ్లకు నోటీసులు జారీ చేశారు జోన్‌ 9 డీసీపీ మంజునాథ్‌ షింగే. 
 
ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే, దానికి ఈ భార్యాభర్తలే బాధ్యత వహించాలని పోలీసులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీచేశారు. ఇదిలా ఉంటే, హనుమాన్‌ చాలీసా పఠించాలంటూ సీఎం ఉద్దవ్‌ థాక్రేకు సవాల్‌ విసిరాడు మహారాష్ట్ర స్వతంత్ర ఎమెల్యే రవి రానా. అది జరగని పక్షంలో తాను, తన భార్య నవనీత్ కౌర్ తమ  అనుచరగణంతో పాటు మాతోశ్రీ బయట హానుమాన్‌ చాలీసా పఠిస్తామని పేరొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ జంటను, శివ సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో రైలు మార్గం గుండా ముంబైకి చేరుకోవాలనుకున్న జంట విమానంలో వచ్చింది. ఆపై నందగిరి గెస్ట్‌కు చేరుకోగా,  అక్కడికి చేరుకున్న శివ సైనికులు హనుమాన్‌ చాలీసాతో హోరెత్తించారు. ఈ వ్యవహారంలో రానా దంపతులు వెనక్కి తగ్గారా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, సుమారు 500 మంది అనుచరులతో వాళ్లు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఎంపికి వై కేటగిరి భద్రత

మరోవంక, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్, మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యులు నవనీత్ రాణాలకు కేంద్రం విఐపి భద్రతా వలయం ఏర్పాటు చేసింది. వీరికి కేంద్ర సాయుధ బలగాల విఐపి భద్రత ఏర్పాట్లు చేశారని అధికారులు శుక్రవారం తెలిపారు. 
 
ఇంటలిజెన్స్ వర్గాల నివేదికల ప్రాతిపదికన వీరికి సాయుధ బలగాలు పారామిలిటరీ దళాల కాపలా అవసరం అని తేలింది. ఇందుకు అనుగుణంగానే వీరికి పారామిలిటరీ కమెండోలతో భద్రతను ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. ఇస్రో ఛైర్మన్‌కు సంబంధించి దేశ అత్యంత కీలకమైన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల రహస్యాలు కాపాడే బాధ్యత ఉంటుంది.