సిఎం కాన్వాయ్ కోసం బలవంతంగా ప్రయాణికుల కారు!

సిఎం కాన్వాయ్ కోసమని తిరుమలకు వెళ్తున్న భక్తుల కారును రవాణాశాఖ అధికారులు బుధవారం రాత్రి ఒంగోలులో బలవంతంగా తీసుకెళ్లడం, ఆ ప్రయాణీకులు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై మిగిలిపోవడం పెద్ద దుమారం రేపింది.  మీడియా ద్వారా వెల్లడైన ఈ అధికారుల దురంహాకారం దుమారం రేపడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 
 
కారును బలవంతంగా తీసుకెళ్లిన హోంగార్డు, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌లపై చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్‌ కుటుంబం ఇన్నోవా కారులో బుధవారం రాత్రి తిరుమలకు బయలుదేరింది. భోజనం చేసేందుకు రాత్రి 10 గంటల తరువాత ఒంగోలులోని పాత మార్కెట్‌ సెంటర్‌లో ఆగారు. 
 
ఆ సమయంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్యారాణి, హోంగార్డు తిరుపాల్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు.  సిఎం కాన్వాయ్ కి కారు కావాలని శ్రీనివాస్‌ను హోంగార్డు డిమాండ్‌ చేశారు. 
 
తాము తిరుమలకు వెళ్లాలని, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పినా వినకుండా కారులోని లగేజీని బలవంతంగా అక్కడే పడేసి కారును హోంగార్డు, అసిస్టెంట్‌ ఎంవిఐ తీసుకెళ్లారు. శ్రీనివాస్‌ కుటుంబం రాత్రిపూట ఒంగోలులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినుకొండ నుండి మరో వాహనాన్ని తెప్పించుకొని వారు తిరుమలకు వెళ్లారు. 
 
 ఒంగోలులో ఆర్టీఏ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

తిరుమలకు వెళుతున్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి.. కారు తీసుకెళ్లిన ఘటనపై  విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఒంగోలు ఏఎంవీఐ సంధ్య, హోంగార్డ్‌ తిరుపాల్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ సంఘటనపై స్థానిక ఎమ్యెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహితం  విచారం వ్యక్తం చేశారు.