తెలంగాణాలో అత్యంత అవినీతి పాలన

తెలంగాణాలో అత్యంత అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జరుపుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటూ  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి డీపీఆర్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 

నీటి కేటాయింపులు లేకుండా జాతీయ హోదా ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ ఇచ్చి మరిచిపోయిన హామీలను గుర్తు చేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని ప్రహ్లాద్ సింగ్ స్పష్టం చేశారు. ఆర్డీఎస్ విషయంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన హామీ ఏమైందన్న ఆయన  సమస్య పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరందరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు చూపడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులకు పాల్పడటం సమంజసం కాదని ప్రహ్లాద్ సింగ్ హితవు పలికారు.

కేసీఆర్… నడిగడ్డలో పాదయాత్ర చేసే దమ్ముందా ?


ఎడారిని తలపిస్తున్న నడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదయాత్ర చేసే దమ్ముందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలంతా మిర్చి పంట వేసి తీవ్రంగా నష్టపోతే నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
 నిజంగా నువ్వు ఈ  ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేసినవని భావిస్తే.. నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం, దళిత బంధు ఇచ్చినట్లు నువ్వు భావిస్తే, ఇక్కడి ప్రజల కోసం కాలేజీ, ఆసుపత్రి కట్టించినవని భావిస్తే ఇక్కడి నుండి పాదయాత్ర చేయ్ అంటూ సవాల్ చేశారు.
 
గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, పల్లె ప్రక్రుతి వనాలు, స్మశాన వాటికలు, టాయిలెట్లు, నర్సరీలు, డంపింగ్ యార్డులకు కేంద్రమే నిధులివ్వగా సిగ్గు లేకుండా వాటిపై కేసీఆర్ బొమ్మలు పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లిలో రైతు వేదికను చూద్దామని వెళుతుంటే పోలీసులు అడ్డుగా నిలవడంపట్ల విస్మయం వ్యక్తం చేశారు. 
 
 7వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గద్వాల నియోజకవర్గంలోని పెద్దపల్లి గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ కు బీజేపీ పెట్టే టెన్షన్ పట్టుకుందని తెలిపారు. ఇంకోవైపు సీఎం పదవి కావాలని కొడుకు పెట్టే టెన్షన్ భరించలేక ఇంట్ల రోజూ మైకులు పగలగొడుతుండట. మేం పాదయాత్ర చేస్తూ ప్రజలకు వాస్తవాలు చేస్తుంటే తట్టుకోలేక పచ్చగున్న పాలమూరులో చిచ్చు పెడుతున్నమంటుండు…  ఇక్కడి గ్రామాల్లో ‘ఇది చేశాం… అది చేశామంటూ’ కేసీఆర్ ఊరూరా ఫ్లెక్సీలు పెట్టిస్తుండు అంటూ ఎద్దేవా చేశారు. 
కేసీఆర్ ఫాంహౌజ్ కు పోవడానికి వందల కోట్లతో రోడ్లేసుకున్నడు కానీ, గద్వాల నియోజకవర్గంలో ఒక్క రోడ్డయినా నిర్మించలేదని బిజెపి  ,మాజీ మంత్రి డీకే  అరుణ ధ్వజమెత్తారు. ఏడేండ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టలేదని దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే తల ఎగిరేసుకొని తిరుగుదామనుకున్నరు… కాని, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో తలదించుకునే పరిస్థితి  ఏర్పడినది ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 చిన్న పిల్లలకు కూడా మద్యం అలవాటు చేస్తున్న దుర్మార్గుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఆమె విమర్శించారు. తెలంగాణ వచ్చినప్పుడు ఏడాది రూ. 6 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతే, నేడు రూ. 40 వేల కోట్లు అమ్ముతున్నడు కేసీఆర్ అంటూ ఆమె దుయ్యబట్టారు.  పేద ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఉచిత వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొస్తే.. తెలంగాణలో దాన్నీ అమలుకానివ్వడం లేదని ఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు.