తెలంగాణలోని కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు

తెలంగాణలోని కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.   కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లేదని చెబుతూ ఎఫ్‌సీఐ దాడుల్లో 4,53,890 సంచుల ధాన్యం తక్కువ ఉందని, అవి ఎక్కడికి పోయాయో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. తక్కువైన ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. 
 
‘‘అన్ని రైస్ మిల్లులలో తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. రైస్ మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో త్వరలో లేఖ రాస్తాం. ధాన్యం కొనాలని సివిల్ సప్లై కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనలేదు‘‘ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
 
రైస్ మిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది కాబట్టి మిస్సైన ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు.  ఈ నెల 13న రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారని పేర్కొంటూ తెలంగాణలో ఉన్న బియ్యాన్ని కొనాలని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనాలకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని  కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. 

కేసీఆర్‌ ప్రభుత్వం కావాలనే ఘర్షణ వాతావరణం సృష్టించిందని మండిపడుతూ అన్ని రాష్ట్రాలకూ ఒకే న్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారమే ధాన్యం కోనుగోలు చేశామని చెబుతూ బాయిల్ రైస్ కోనుగోలు చేయబోమని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశామని పేర్కొన్నారు. 

టీఆర్‌ఎస్‌ నేతలు ఉద్దేశ పూర్వకంగా ప్రధాని మోదీని తిట్టడం, దేశం నుంచి తరిమి కొడతామని పిచ్చి పిచ్చిగా మాట్లాడారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో, రాష్ట్రంలో, గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించారని,  బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతామని కామెంట్స్‌ చేశారని  అంది ఇది మంచిపద్దతి కాదని హితవు చెప్పారు.

క్వింటాల్‌ ధాన్యానికి కేంద్రం రూ.1,960 ధర నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలలో రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 యాసంగి, రబీ ధాన్యాన్ని ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపారు. దానిపై ఐదు సార్లు కేంద్రం లేఖ రాసినా తెలంగాణ సర్కార్ నుంచి స్పందన లేదని ధ్వజమెత్తారు. 

 ఈ ఏడాది 40 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ ఇస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని,  అందుకోసం 15 కోట్ల గోనె సంచులు అవసరమైనా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం కోటి గోనె సంచులు మాత్రమే ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు.  వాటితో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారు..? తండ్రి కొడుకులు తట్టలో తీసుకువస్తారా..?. అంటూ ఎద్దేవా చేశారు. 

 హుజురాబాద్ ఎన్నికల ఓటమి భరించలేక, బాధ్యత మరచి కక్షతో కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను రావణకాష్టంగా మార్చారని విచర్మ వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే వేరే అంశాలు ఉన్నాయని చెబుతూ తండ్రి, కొడుకులు రైతులపై రాజకీయాలు ఆపాలని కేంద్ర మంత్రి హెచ్చరించారు. 

 కాగా,పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్లపై కిషన్ రెడ్డి స్పందిస్తూ. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నది తెలంగాణలోనే అని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక వ్యాట్ ను తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తోందని చెప్పారు. ద్రవ్యోల్బణం జాతీయ సగటు 6.99శాతంగా ఉంటే,  తెలంగాణలో మాత్రం అది 7.66 శాతంగా ఉందని పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతం తగ్గుతుంటే తెలంగాణలో మాత్రం పెరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబంలో మాత్రమే ఉద్యోగ శాతం పెరిగిందని చురకలంటించారు. పోలీసుల వేధింపులు కూడా తెలంగాణలోనే ఎక్కువని ధ్వజమెత్తారు.