కేరళ సిపిఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య 

`లవ్ జిహాద్’ వాస్తవం అంటూ ఓ పార్టీ కార్యకర్త చేసిన మతాంతర వివాహం కారణంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విచ్ఛిన్నమైనదని పార్టీ మాజీ ఎమ్యెల్యే జార్జ్ ఎం థామస్ పేర్కొనడం కేరళ సిపిఎంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ విషయమై ఆత్మరక్షణలో పడిన పార్టీ జిల్లా కమిటీ ద్వారా `బహిరంగంగా నిందించడం’ ద్వారా మాజీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్య తీసుకుంది.

సిపిఎం రాజ్యాంగం ప్రకారం, ‘బహిరంగంగా నిందించడం’ అనేది మూడవ కఠినమైన క్రమశిక్షణా చర్య, ఇది హెచ్చరిక నుండి మొదలవుతుంది, తర్వాత నిందలు, బహిరంగ దూషణలు, పార్టీ పదవి నుండి తొలగింపు , పార్టీ సభ్యత్వం నుండి తొలగింపు  వరకు కొనసాగుతుంది.

కోజికోడ్‌లోని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా ఉన్న థామస్‌పై పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పార్టీ ఏకైక క్రైస్తవ ముఖం అయిన థామస్‌పై పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడారని రాష్ట్ర నాయకత్వం చెప్పిన ఒక రోజు తర్వాత బుధవారం ఈ చర్య తీసుకున్నారు.

సమావేశం అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి పి.మోహనన్‌ మీడియాతో మాట్లాడుతూ మతాంతర వివాహంపై థామస్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ లౌకిక వైఖరికి విరుద్ధమని విమర్శించారు. “అతను తప్పు అర్థం చేసుకున్నాడు. క్షమాపణ చెప్పాడు. సమస్య తీవ్రతను గ్రహించిన పార్టీ ఆయనను బహిరంగంగా దూషించాలని నిర్ణయించింది” అని వెల్లడించారు. 

 
“థామస్‌పై ఏకగ్రీవంగా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాము. పార్టీ వ్యతిరేక ప్రకటన వెలువడిన వెంటనే తప్పును సరిదిద్దుకున్నందున ఇకపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండవు” మోహనన్ తెలిపారు.
 
కోడంచెరి నూరంతోడుకు చెందిన డివైఎఫ్‌ఐ నాయకుడు షెజిన్‌ ఎంఎస్‌, కోడంచెరి తెయ్యపరకు చెందిన నర్సు జాయిస్‌ జోసెఫ్‌ తమ ఇష్టానుసారం పెళ్లి చేసుకునేందుకు గత శనివారం దేశం విడిచి వెళ్లారు. సౌదీ అరేబియాలో నర్సుగా పనిచేస్తున్న జాయిస్ మరో వ్యక్తితో నిశ్చితార్థానికి రెండు వారాల ముందు ఇంటికి తిరిగి వచ్చింది. 
 
శనివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాలేదు. అనంతరం కోర్టుకు హాజరైన మహిళను షేజ్‌తో తన ఇష్టానుసారం వివాహం చేసుకుంటున్నట్లు చెప్పడంతో విడుదల చేశారు. ఈ విషయమై ఆమె కు సంబంధించిన క్రైస్తవులలో ఆందోళన కలిగించిందని థామస్ విచారం వ్యక్తం చేశారు. 
 
 యువ కామ్రేడ్ చర్య “ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసింది. షెజిన్‌పై పార్టీ చర్య తీసుకోవచ్చు” అని ప్రకటించారు. థామస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “లవ్ జిహాద్ అనేడిది వాస్తవం. పార్టీ ఈ అంశాన్ని ఓ ప్రాత్రంలో  ధృవీకరించింది” అని స్పష్టం చేశారు. 
 
థామస్ ప్రకటనతో ఇరకాటంలో పడిన సిపిఎం నాయకత్వం, పార్టీ
ప్రతిష్టను కాపాడుకోవడానికి, సీపీఎం జిల్లా నాయకత్వం దీనిని ‘స్లిప్ ఆఫ్ టంగ్’ (నోరు జారడం)గా అభివర్ణించింది. పార్టీ యువజన ఫ్రంట్ డివైఎఫ్‌ఐ నేత షెజిన్‌కు మద్దతుగా నిలిచింది.
 
 వీహెచ్‌పీ హర్షం 
 
ఇలా ఉండగా, కేరళలో లవ్ జిహాద్ ఉన్నట్లు పార్టీ రికార్డుల్లో సమాచారం ఉందని తిరువంబాడి మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఎం థామస్ వెల్లడించడాన్ని వీహెచ్‌పీ స్వాగతించింది. విశ్వహిందూ పరిషత్ ఏళ్ల తరబడి చెబుతున్న వాస్తవాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రకటన అంగీకరించిందని వీహెచ్‌పీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తమకు క్రైస్తవ ఓట్లు తగ్గుతున్నాయని డివైఎఫ్‌ఐ ప్రాంతీయ కార్యదర్శి కూడా బహిరంగంగానే అంగీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
 “హిందూ-క్రిస్టియన్ బాలికలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి ముఠాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, కేరళలో చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అపహరణకు గురైన బాలికలను కనిపెట్టేందుకు కూడా సిద్ధంగా లేని పోలీసులు.. ఇలాంటి కేసులను సీబీఐకి గానీ, ఎన్ఐఏకు గానీ అప్పగించేందుకు సిద్ధపడాలి” అని  విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వీజీ తంపి, ప్రధాన కార్యదర్శి వీఆర్ రాజశేఖరన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.