ఉక్రెయిన్ సేనలకు రష్యా అల్టిమేటం!

ఉక్రెయిన్‌ బలగాలు తక్షణమే ఆయుధాలు విడిచిపెట్టాలని రష్యా తాజాగా హెచ్చరించింది. తాము ముట్టడించిన మరియుపోల్‌ కోసం ఉక్రెయిన్‌ సైన్యం చేస్తోన్న ప్రతిఘటనను వదులుకోవాలని కొత్త అల్టిమేటం జారీ చేసింది. మాస్కో కొత్త దాడిని ప్రారంభించిందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్న తర్వాత.. రష్యా రక్షణ శాఖ ఈ హెచ్చరిక చేసింది. 
 
`లొంగిపోండి లేదా చచ్చిపోండి’ అనే హుంకరింపులతో రష్యా సేనలు ఉక్రెయిన్‌పై తమ దాడులను మంగళవారం ఉధృతం చేశాయి. మేరియుపోల్ స్టీల్‌ప్లాంట్‌లో కానీ మరెక్కడ కానీ తలదాచుకుని ఉనికిని చాటుకునే విఫల యత్నాలకు దిగరాదని రష్యా సైనికాధికారులు ఉక్రెయిన్‌ను హెచ్చరించాయి. 
 
రష్యా బలగాలు ఇటీవలి కాలంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ ఆధీనంలో ఉంటూ వస్తున్న అత్యంత కీలక ఆర్థిక ప్రాంతాలు పారిశ్రామిక వాడల నగరాలను సముద్ర మార్గాలను కేంద్రీకృతం చేసుకుని దాడికి దిగింది. ఈ క్రమంలో మేరియూపోల్‌నుదాదాపుగా రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. అయితే రష్యా సేనలకు తీవ్రస్థాయి ప్రతిఘటన ఇప్పుడు అక్కడి మేరియూపోల్‌లోని సువిశాల స్టీల్‌ప్లాంట్ స్థావరంలో తిష్టవేసుకుని ఉన్న అసంఖ్యాక సైనిక బలగాల నుంచి ఎదురవుతోంది.
 
ఉక్రెయిన్‌ సైనికులు చేస్తోన్న ప్రతిఘటనను ఆపేందుకు కైవ్‌ అధికారులు వారికి సంబంధిత ఆదేశాలివ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. కానీ ఉక్రెయిన్‌ ఆర్మీకి కైవ్‌ అధికారుల నుండి ఎలాంటి సూచనలు, ఆదేశాలు అందవని తెలిసి వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుని, ఆయుధాలను విడిచి పెట్టాలని పిలుపునిస్తున్నామని పేర్కొంది.
ముట్టడిలో ఉన్న  ఓడరేవు నగరం మరియూపోల్ రక్షకులు తమ ప్రతిఘటనను ఆపేయాలని రష్యా  కొత్త అల్టిమేటం జారీ చేసింది. తలాతోకలేని ఉక్రెయిన్‌ యోధుల పోరాటాన్ని ఆపించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాదు.. మరియూపోల్‌లో ఆయుధాల్ని పక్కపెడితే గనుక ఉక్రెయిన్‌ బలగాల ప్రాణాలకు హామీ ఇస్తామని  సున్నితంగా హెచ్చరికలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల సంక్షోభం 50 రోజులు దాటింది. ఈ తరుణంలో రెండో దశలోకి యుద్ధం అడుగుపెట్టిందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రకటించారు.  రష్యా అణ్వాయుధాలు ఉపయోగించడానికి సిద్ధపడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఇక నుంచి యుద్ధం మరింత ముదురుతుందంటూ కామెంట్‌ కూడా చేశాడు. మరోవైపు రష్యా దళాలు తూర్పు భాగంపై పట్టు కోసం తీవ్రంగా యత్నిస్తున్నాయి.
 
 కాగా, ఈ ప్రకటనలో కొత్త దాడి గురించి ప్రస్తావించలేదు. మరియుపోల్‌లోని అజోవ్‌ సముద్ర తీరంలోకి దూసుకువస్తోన్న రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ యోధులు విపత్కర పరిస్థితిలో ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా ఉండగా, రష్యా తన కొత్త దాడిలో ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, ఆ ప్రాంతం, క్రిమియా మధ్య భూసంబంధాన్ని సృష్టించడం, ఉక్రెయిన్ సాయుధ బలగాలన్నింటినీ నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్‌లోని క్రెమిన్నా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.  ఉక్రేనియన్ దళాలు నగరం నుండి ఉపసంహరించుకున్నాయని ప్రాంతీయ గవర్నర్ మంగళవారం రాయిటర్స్ నివేదించినట్లు తెలిపారు. “క్రెమిన్నా ‘వొర్క్స్ ‘ (రష్యన్లు) నియంత్రణలో ఉంది. వారు నగరంలోకి ప్రవేశించారు, ”అని లుహాన్స్క్ ప్రాంత గవర్నర్ సెర్హి గైడై చెప్పారు.

మరోవంక, రష్యా-మద్దతుగల వేర్పాటువాద శక్తులు ముట్టడి చేసిన  ఉక్రెయిన్ నౌకాశ్రయం మారియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ మెటలర్జికల్ ప్లాంట్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని వేర్పాటువాద ప్రతినిధి ఎడ్వర్డ్ బసురిన్  చెప్పినట్లు ఓ  వార్తా సంస్థ తెలిపింది. ఇంతలో, నగరాలు, పట్టణాలలో చిక్కుకున్న పౌరులను తరలించడానికి ఎటువంటి మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయడానికి రష్యా ఒప్పందాన్ని ఉక్రెయిన్ వరుసగా మూడవ రోజు పొందలేకపోయిందని ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్‌చుక్ చెప్పారు.