భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌

పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, మంచి లక్ష్యంతో కూడిన విధానాల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను తట్టుకుని నిలబడగలుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్   క్రిస్టలినా జార్జీవా కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 ప్రపంచ అభివృద్ధిపై భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం సహా అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.  క్రిస్టలినా మాట్లాడుతూ, భారత దేశం మంచి లక్ష్యంతో కూడిన విధానాలను అమలు చేస్తోందని, దీనివల్ల పరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకుని నిలబడటానికి అవకాశం కలిగిందని తెలిపారు.
 ప్రస్తుతం విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు సహాయపడుతున్నందుకు భారత దేశాన్ని ఆమె  ప్రశంసించారు. శ్రీలంకతో ఐఎంఎఫ్ నిరంతరం క్రియాశీలంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు టీకాకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు భారతదేశాన్ని ఆమె  అభినందించారు. ఈ మహమ్మారితో పోరాడేందుకు ఇతర బలహీన దేశాలకు సహాయపడినందుకు భారత దేశాన్ని ప్రశంసించారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ట్వీట్‌లో, నిర్మల సీతారామన్, క్రిస్టలినా జార్జీవా తాజా భౌగోళిక రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, పెరుగుతున్న ఇంధనం ధరలకు సంబంధించిన సవాళ్ళపైనా ఈ పరిణామాల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు.
నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, కరోనా  మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కోసం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. ప్రభుత్వం  మూల ధన వ్యయం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.  ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం కోసం నిధుల సరఫరాను పెంచడం, ప్రధాన మౌలిక నిర్మాణపరమైన సంస్కరణలు, పటిష్టమైన ద్రవ్య విధానాలను అమలు చేయడం వల్ల మహమ్మారి అనంతరం కోలుకోవడం సాధ్యమైనట్లు వివరించారు.
ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధి రేటును భారత దేశ ఆర్థిక వ్యవస్థ నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతం నుంచి 8.5 శాతం జీడీపీ వృద్ధి సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అధిక వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరంలో 35.4 శాతం పెంచింది. రూ.7.5 లక్షల కోట్లకు మూలధన వ్యయాన్ని పెంచింది. మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ పెట్టుబడుల ఆధ్వర్యంలో కోలుకోవడం కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.5.5 లక్షల కోట్లు ఉండేది.

డిజిటల్ కరెన్సీతో మనీ ల్యాండరింగ్కు అవకాశం

క్రిప్టోకరెన్సీపై మార్కెట్ లో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో,  క్రిప్టో గురించి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీతో నియంత్రణ చేయాలి కానీ… నియంత్రణ కోల్పోతే దేశానికే సమస్య అవుతుందని పేర్కొన్నారు. కరోనా సమయాలమో డిజిటల్ లావాదేవీలపై ఆధారపడ్డ వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారుని చెప్పారు.