కరోనా మృతుల డబ్ల్యుహెచ్‌ఒ గణాంకాలను ప్రశ్నించిన కేంద్రం

దేశవ్యాప్తంగా కరోనా మృతులను లెక్కగట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వినియోగించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను ఫాలో కావడాన్ని తప్పుబట్టింది. 
 
తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్‌ విషయంలోనూ పాటించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.  కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్‌ అడ్డుకుంటోందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు అధికారికంగా ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే కరోనా మరణాలు 1.5 కోట్లు అధికంగా ఉంటాయని డబ్ల్యుహెచ్‌ఒ అంచనా వేసింది. దీంతో భారత్‌లోనూ మరణాలు కనీసం 40 లక్షలుగా ఉంటాయని లెక్కగట్టింది.

అయితే డబ్ల్యుహెచ్‌ఒ గణాంకాలను తాము తప్పుబట్టడం లేదని, ఇందుకు అనుసరించిన విధానంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ అంశంపై డబ్ల్యుహెచ్‌ఒకి క్రమంత ప్పకుండా సాంకేతికంగా వివరాలు అందించామని తెలిపింది. 
 
టైప్‌ 1 దేశాల నుండి నేరుగా సేకరించిన డేటాకు అనుసరించిన లెక్కింపు విధానాన్ని టైప్‌ 2 దేశాలకు (భారత్‌తో సహా) కూడా అనుసరిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  టైప్‌ 1 దేశాల నుండి సేకరించిన సమాచారానికి, భారత్‌లోని 18 రాష్ట్రాల నుండి సేకరించిన విశ్లేషించని డేటాకు ఒకే మోడల్‌ని వినియోగించడంతో అదనపు మరణాలు నమోదవుతాయని పేర్కొంది. 
 
అంచనాల్లో భారీగా వైవిధ్యం ఉన్న ఇటువంటి లెక్కింపు విధానం చెల్లుబాటు, ఖచ్చితత్వంపై ఆందోళనలను పెంచుతుందని తెలిపింది. ఈ లెక్కిపు విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఆరు లేఖలతో పాటు వర్చువల్‌గా డబ్ల్యుహెచ్‌ఒతో చర్చలు జరిపామని వివరించింది. 
 
ఈ విధానంపై భారత్‌తో పాటు ఇతరసభ్య దేశాలు చైనా, ఇరాన్‌, బంగ్లాదేశ్‌, సిరియా, ఇథియోపియా, ఈజిప్ట్‌లు ప్రశ్నలు లేవనెత్తాయని తెలిపింది. 
 
చిన్నస్థాయిలో శాంపిల్‌ సైజు వివరాల ఆధారంగా కరోనా మరణాలను అంచనా కట్డడం ట్యునీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందని, 130 కోట్ల మంది ఉన్న భారత్‌ వంటి పెద్ద దేశాలకు కాదని, భారత్‌ నమూనా కచ్చితత్వంతో కూడుకుందని కేంద్రం స్పష్టం చేసింది.
మరణముప్పు ముందే పసిగట్టవచ్చా!
 
ఇలా ఉండగా, ఆసుపత్రుల్లో చేరిన కరోనా బాధితుల్లో మరణముప్పును ముందే పసిగట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ ఈసిజితో ముందే అంచనా వేయవచ్చని, దీంతో ఆ బాధితులకు మెరుగైన వైద్యం అందించే వీలుంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. 
 
ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సౌరాస్కీ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్త ఏరియల్‌ బనాయ్ బృందం ఈ అధ్యయనం చేపట్టింది. సాధారణంగా ఈసిజిలో ‘క్యూటీ విరామం’ అనేది గుండె గదులు సంకోచించినప్పటి నుంచి విశ్రాంతి తీసుకునే వరకూ మధ్యనున్న సమయాన్ని విద్యుత్‌ సంకేతాల ద్వారా మిల్లీ సెకెండ్లలో కొలిచి చెబుతుంది. 
 
అధ్యయనంలో భాగంగా వివిధ ఆసుపత్రుల్లో చేరిన కరోనా బాధితులకు ఈసిజి తీయించారు. అందులోని క్యూటీ విరామాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితుల మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. క్యూటీ విరామం ఎక్కువగా ఉండేవారికి గుండె పోటు, అరిథమియాస్‌ (గుండె స్పందనల మధ్య తేడాలు), గుండె కొట్టుకోవడానికి సంబంధించిన రుగ్మతల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు శాస్త్రీయంగా అంచనాకు వచ్చారు. 
 
కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరిన వెంటనే వారికి ఈసిజి తీయించాలని, అందులోని క్యూటీ విరామాలను పరిశీలించడం ద్వారా వారికి గుండె పోటు ముప్పును ముందుగానే గుర్తించవచ్చని బనాయ్  సూచించారు.