కాంగ్రెస్ తీవ్రవాదంకు  వ్యతిరేకంగా మాటలు, కానీ ఉగ్రవాదులను విడుదల చేస్తుంది

దేశంలో ఇటీవల వివిధ ప్రాంతాలలో చెలరేగిన మతపరమైన హింసాత్మక సంఘటనలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద వైఖరిని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎండగట్టారు. కర్ణాటక బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా హొసపెటెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ తీవ్రవాదంకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులను విడిచి పెడుతోందని ఎద్దేవా చేశారు. 

రాడికల్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకర్తలపై తంలో కాంగ్రెస్, దాని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేసులను ఎత్తివేసారని ఆయన ఆరోపించారు. “రామ నవమి శోభాయాత్రపై ఎక్కడో దాడి జరగడం, ఇంకో చోట దాడి జరగడం మీరు చూసి ఉంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి బొమ్మై, ఆయన హోం మంత్రి. దానికి సంబంధించిన వివరాలను తప్పకుండా పరిశీలిస్తారు. కానీ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలను, కి యే డిజైన్ చేసిన తారీకే సే సమాజ్ కో ఖండిత్ కర్నే కి కోషిష్ హో రహీ హై (ఇది సమాజాన్ని ఒక రూపకల్పన పద్ధతిలో విభజించే ప్రయత్నం)” అని నడ్డా ఆరోపించారు.

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి బాధగా ఉందని పేర్కొంటూ సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని నడ్డా ఇలా అన్నారు: “ఔర్ మే యే పూచ్నా చాహుంగా, కి క్యా పిఎఫ్‌ఐ కే లోగోన్ కో జో ఆన్-బుక్స్ లాయే గయే ది, ఉంకే చుడనే కా కామ్ సిద్ధరామయ్య నే కియా థా కి నహీం క్యా థా? ఇస్కీ కర్నాటక్ కీ జంతా జవాబ్ చాహ్తీ హై (నేను అడగాలనుకుంటున్నాను, ఒకప్పుడు అరెస్ట్ అయినా పిఎఫ్ఐ వ్యక్తులను సిద్ధరామయ్య విడుదల చేశారా లేదా? కర్ణాటక ప్రజలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను)”.

“మీరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ, మీరు ఉగ్రవాదులను విడుదల చేస్తారు. మీరు లోపల స్నేహాన్ని కొనసాగించండి కానీ బయట ముసుగు వేసుకోండి. బీజేపీ బహిరంగంగా  పని చేస్తుంది. వాటిని బహిర్గతం చేయండి విషయాలను స్పష్టం చేయండి” అంటూ ధ్వజమెత్తారు

అవినీతి, కాంగ్రెస్ పార్టీ పర్యాయపదాలు అని కూడా బీజేపీ నేత స్పష్టం చేశారు. “కాంగ్రెస్ ఉన్న చోట అవినీతి ఉంది, కాంగ్రెస్ ఉన్న చోట కమీషన్ ఉంటుంది, అవి ఒకే నాణానికి రెండు ముఖాలు. బిజెపి ఉన్న చోటే మిషన్‌ ఉంటుంది” అంటూ నడ్డా ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో, కేంద్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ  “దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. దేశాన్ని లూటీ చేసింది. అవినీతి, కాంగ్రెస్ ఒకే నాణేనాకి రెండు వైపులు” అంటూ విమర్శించారు.  
 
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలే వచ్చేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి అనేదే కనిపించడం లేదని గుర్తు చేశారు. “మా లక్ష్యం ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలను తీర్చడం, దేశాన్ని అభివృద్ధి వైపుకు తీసుకెళ్లడమే” అని నడ్డా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ దేశాన్ని పూర్తిగా అవినీతిలోకి నెట్టివేస్తే తమ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ఆ పరిస్థితిని మెరుగు పరిచిందని నడ్డా తెలిపారు.  అవినీతి ఉపేక్షించం కాబట్టే ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయని నడ్డా పేర్కొన్నారు.


ఇలా ఉండగా, సిద్ధరామయ్య నేతృత్వంలో 2013 నుంచి 2018 మధ్య కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 175 మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని ఆదేశించింది. మతపరమైన ఉద్రిక్తతల సమయంలో మైసూరులో నిరసనలు చేపట్టడానికి నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన కేసులతో ఎక్కువ మంది పిఎఫ్ఐ కార్యకర్తలు ముడిపడి ఉన్నారు. అప్పట్లో కేసుల ఎత్తివేతపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.