వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నేతతో మోదీ ఫోన్‌లో చర్చలు

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టపరచుకోవాలన్న కృత నిశ్చయాన్ని భారత్‌, వియత్నాం నేతలు వ్యక్తం చేశారు. భారత్‌, వియత్నాం దౌత్య సంబంధాల యాభయ్యో వార్షికోత్సవాల (జనవరి7, 1972 నుంచి జనవరి 7,2022) సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గుయెన్‌ ఫూ ట్రాంగ్‌తో ఫోన్‌లో చర్చించారు.
ఇరు దేశాల మధ్య సుహృద్భావ, స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం కావడం, ఇటీవల కాలంలో ప్రత్యేకించి కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో పరస్పర సహకారం, దీంతోబాటు పటిష్టవంతమవుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పై ఇరువురు నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 13వ జాతీయ మహాసభ విజయవంతం కావడం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికైన గుయెన్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. ఏప్రిల్‌ 14న పుట్టిన రోజు కావడంతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు.
భారత విదేశాంగ విధానంలో ముఖ్యంగా ‘యాక్ట్‌ ఈస్‌ పాలసీ’ లో వియత్నాం ఒక మూల స్తంభంగా ఉందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపైనా వీరిరువురూ చర్చించారు. 2016లో వియత్నాంలో మోదీ  పర్యటించిన సమయంలో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
 ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తరించుకోవాల్సి వుందని ఇరువురు భావించారు. వియత్నాంలో భారతదేశ ఫార్మా రంగానికి, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని కోరారని పిఎంఓ కార్యాలయ ప్రకటన తెలిపింది.
ఇరు దేశాల మధ్య చారిత్రక, నాగరిక సంబంధాల ప్రాముఖ్యతను మోదీ  గుర్తు చేశారు. వియత్నాంలో చామ్‌ కట్టడాల పునరుద్ధరణలో భారతదేశ పాత్ర పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం పెంపునకు ఇరువురు నేతలు అంగీకరించారని పిఎంఓ తెలిపింది.