వర్ధమాన దేశాలపై యుద్ధ పర్యవసానాలు తీవ్రం 

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌తో విదేశాంగ మంత్రి జై శంకర్‌ శుక్రవారం భేటీ అయి విస్తృతాంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా నెలకొంటున్న ప్రభావంపై ముఖ్యంగా ఆహార, ఇంధన భద్రతలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. 

వర్ధమాన దేశాలపై ఈ యుద్ధ పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయని జైశంకర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌ల్లో పరిస్థితులపైనా చర్చించినట్లు చెప్పారు. 

అమెరికాలో పర్యటన తర్వాత బుధవారం జై శంకర్‌ ఐక్యరాజ్య సమితికి వచ్చారు. కీలకమైన సమకాలీన సవాళ్ళను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు భారత్‌తో కలిసి పని చేసేందుకు గుటెరస్‌ ఆసక్తి చూపారంటూ ఆయనను అభినందించారు.

 అమెరికాతో 2ప్లస్‌2 చర్చలు జరిపేందుకు జైశంకర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌ వాషింగ్టన్‌ వచ్చారు. చర్చలు ముగిసిన అనంతరం సంయుక్త ప్రకటన చేస్తూ, మానవ హక్కులను గౌరవించాల్సిందిగా తాలిబన్‌ నాయకత్వాన్ని కోరారు. 

మయన్మార్‌లో హింసను విడనాడాల్సిందిగా కోరారు. నిరంకుశంగా నిర్బంధంలో వుంచిన వారందరినీ విడుదల చేయాలని ఆ ప్రకటన పేర్కొంది. తక్షణమే ప్రజాస్వామ్య పంథాలోకి రావాలని కోరింది. ఆసియాన్‌ ఐదు పాయింట్లను ఏకగ్రీవంగా అమలు చేయాలని పిలుపిచ్చింది.