తెలంగాణ ఆరోపణలను కొట్టిపారేసిన కేంద్రం

ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది.  ‘‘దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉంది. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఎంత అవసరమో అంతే తీసుకుంటాం.. ఎవరిపైనా వివక్ష లేదు. తెలంగాణలో గత ఐదేళ్లలో 7 రెట్ల ధాన్యం సేకరణ చేశాం. ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. పంజాబ్‌ నుంచి పారా బాయిల్డ్‌ రైస్‌ తీసుకోలేదు’’ అని కేంద్రం వివరణ ఇచ్చింది.
రాష్ట్రాల దగ్గర నుంచి తీసుకోవాల్సిన బియ్యం ఇంకా ఉందనేది అవాస్తవమని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు సరికాదని పేర్కొంటూ బియ్యం సేకరణఫై అన్ని రాష్ట్రాలను  వివరాలు కోరామని తెలిపారు.  ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే బియ్యం సేకరిస్తామని స్పష్టం చేశారు.
ఎఫ్ సీఐ దగ్గర ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఉందని చెబుతూ  తెలంగాణ విజ్ఞప్తి మేరకు మరో 20 లక్షల టన్నులు సేకరించామని చెప్పారు. ధాన్యం  సేకరణ అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంటూ రైతులకు అవగాహన కల్పించాల్సిన బాద్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు.
పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదని పాండే స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఎంత రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామన్నాని భరోసా ఇచ్చారు. బియ్యం సేకరణలో ఏ రాష్ట్రంపై వివక్ష లేదని పేర్కొంటూ  ఏజెంట్ గా మాత్రమే రాష్ట్రాలు ధాన్యాన్ని సేకరిస్తాయని తెలిపారు.
ఏపీ రా రైస్ ఇస్తుందని, దానితో తెలంగాణకు ఇబ్బందేంటని ఆయన  ప్రశ్నించారు. రా రైస్ ఇవ్వబోమని తెలంగాణ కేంద్రంతో ఒప్పందం రాసుకుందని చెబుతూ  ఎఫ్ సీఐ నేరుగా ధాన్యం సేకరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
కాగా, ఈ సందర్భంగానే ధాన్యం సేకరణలో వివాదం ఏమీ లేదని ఎఫ్‌సీఐ రిజనల్‌ మేనేజర్‌ దీపక్‌ శర్మ స్పష్టం చేశారు. పారా బాయిల్డ్‌ రైస్‌కి డిమాండ్‌ లేదని చెబుతూ రా రైస్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం ఉత్పత్తి ఎంత అవుతుంది.? ఎంతమేర ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే రా రైస్‌ ఎంత ఇచ్చినా తీసుకుంటాని స్పష్టత ఇచ్చారు.