అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత

 
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  విద్వేష పూరిత ప్రసంగాలు చేశారనే అభియోగంతో దాఖలైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2012 డిసెంబర్‌లో హిందువులను ఉద్దేశించి నిజామాబాద్, నిర్మల్‌లో అక్బర్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్‌పై నమోదయిన రెండు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 
 
కేసులు కొట్టివేసినంత మాత్రాన సంబరాలు వద్దని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దాదాపు 30 మంది సాక్షులను కోర్టు విచారించింది. సుదీర్ఘ వాదనల తర్వాత బుధవారం నాంపల్లి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
 
పదేళ్ల క్రితం ఎంఐఎం సభలో అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు వంద కోట్ల మంది అయితే మేము కేవలం పాతిక కోట్లు మాత్రమే.. ఓ 15 నిముషాలు మాకు అప్పగించండి.. ఎవరు ఎక్కువో, తక్కువో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు.’’ అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఈ ప్రసంగంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసులో 2013 జనవరి 8న అరెస్టయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి నిర్మల్ లో మొదటగా నమోదైన ఎఫ్ఐఆర్ ను మాత్రమే ప్రధాన కేసుగా భావించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 
 
ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించకపోవడం వల్లే కోర్టు కేసును కొట్టేసిందని అక్బరుద్దీన్ తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ తమకో  న్యాయం, ఎంఐఎం వాళ్లకు మరో న్యాయమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తన ట్విట్టర్ అకౌంట్ లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘అంధా కానూన్’ సినిమా పోస్టర్ ను షేర్ చేశారు.
 
ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కెళ్ళాలి 
 
అక్బరుద్దీన్ ఓవైసీపై నాంపల్లి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలని విశ్వహిందూ పరిషద్ తెలంగాణ డిమాండ్ చేసింది. నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్ధం ప్రకటించే విధంగా, దేవీదేవతలు కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సైరైన శిక్ష పడాలని స్పష్టం చేసింది. 
 
సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంతో టి ఆర్ ఎస్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైన ఫలితంగానే నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసినదని పరిషద్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ స్పష్టం చేశారు.