వైసిపిలో జగన్ పట్టు సడలుతోందా!

2019లో అధికారంలోకి వచ్చిన నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకొన్నప్పుడు వై.ఎస్.ఆర్.సి.పి.లో ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కాలేదు. దాదాపు మూడేళ్ల పాలన తదనంతరం జరిగిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సందర్భంగా మంత్రి పదవులు కోల్పోయిన, ఆశావహుల మద్దతుదారుల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన జ్వాలలు రోడ్డెక్కాయి.
 
 ఈ పరిణామం పార్టీ నాయకుడి పట్టు బలహీనపడిందా!? అన్న అనుమానం ప్రజల్లో కలగడానికి అవకాశం ఇచ్చింది.  జగన్ ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేధింపులు గురిచేసినప్పుడు, ఆయనకు బాసటగా నిలిచి, పదవులను త్యాగం చేసి, పోరాటాలలో పాల్గొన్న వారిని పక్కకు నెట్టి, అధికారం వస్తుంది అనుకున్నప్పుడు దగ్గర చేరిన వారిని ఇప్పుడు అందలం ఎక్కిస్తుండడాన్ని పలువురు సహింపలేక పోతున్నారు. 
 
బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి సుచరిత, సామినేని ఉదయభాను వంటి వారు ఈ విషయాన్నీ బహిరంగంగానే ప్రస్తావించడం గమనార్హం. ముఖ్యంగా జగన్ తో తొలినుండి వెంటఉంటూ జైలుకు సహితం వెళ్లిన విజయసాయిరెడ్డి వంటివారు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. భూమన కరుణాకరరెడ్డి, చెవిటిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వార్లకు సహితం తగిన ప్రాధాన్యత కనిపించడం లేదు. 
మధ్యలో వచ్చిన రామకృష్ణారెడ్డి వంటి వారు `సూపర్ సీఎం’గా వ్యవహరిస్తూ, పార్టీలో పెత్తనం చేస్తుండటాన్ని చాలామంది సహింపలేక పోతున్నట్లు స్పష్టం అవుతుంది.  రెండున్నర ఏళ్ల తర్వాత తన మంత్రివర్గంలోని 90 శాతం మందిని తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో చేసిన ప్రకటన గడువు ముగియడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అజెండా తెరపైకి వచ్చి, కేవలం నాలుగైదురికి మాత్రమే తిరిగి పదవులన్నారు. కానీ ఇప్పుడు 55 శాతం మందిని మాత్రమే తొలగించారు.
మంత్రివర్గం మార్పులలో జగన్ ఎన్ని వత్తిడులు ఎదుర్కొన్నారో ఈ అంశం స్పష్టం చేస్తుంది. ఏకంగా 11 మందిని కొనసాగింపక విధిలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి  ఏర్పడిందని తేలిపోయింది. అయినా అసంతృప్తి సెగలు ఆగలేదు.  26 జిల్లాలలో 8 జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.
 శ్రీకాకుళం, కడప మినహాయిస్తే ముఖ్యమైన విశాఖ, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర నగరాలు, పట్టణాలకు ప్రాతినిథ్యం లేదు. అంటే మంత్రివర్గంలో పట్టణ ప్రాంతాలకు ప్రాతినిథ్యం నామమాత్రమే అని స్పష్టం అవుతుంది.
మంత్రివర్గ కూర్పులో 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కుల సమీకరణల కోణం స్పష్టంగా కనబడుతున్నది. సామాజిక న్యాయానికి పెద్ద పీఠ వేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దానికి కొంత ప్రాతిపదిక ఉన్నది. కానీ, అదే సందర్భంలో మంత్రివర్గంలో మహిళల ప్రాతినిథ్యం కేవలం 15 శాతమే కావడం గమనార్షం.   అలాగే, సంఖ్య రీత్యా, రాజకీయ ప్రాబల్యం రీత్యా  పెద్దవిగా ఉన్న కొన్ని సామాజిక తరగతులకు అసలు ప్రాతినిథ్యమే లేదు. అందువల్ల సమతుల్యత లోపించింది.