99.8 శాతం ఉత్పాదికతతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 

బహుశా ఇటీవల కాలంలో మొదటిసారిగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పెద్దగా అంతరాయాలు లేకుండా జరిగాయి. రికార్డు స్థాయిలో 99.8 శాతం ఉత్పాదికతను నమోదు చేసుకున్నాయి. లోక్ సభ ఉత్పాదికత అయితే 129 శాతంగా ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం వంటి కీలక అంశాలపై రాజకీయాలకు అతీతంగా సభ్యులు చర్చలలో పాల్గొనడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 

పార్లమెంటు బడ్జెట్ సమావేశానికి గురువారం తెరపడింది. నిర్ణయించిన షెడ్యూల్‌కు ఒక రోజు ముందే లోక్‌సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల కోర్కె మేరకు ఒకరోజు ముందుగా వాయిదా పడటం గమనార్హం.  ఈ సమావేశాల్లో ఉభయ సభల్లోను అర్థవంతమైన చర్చలు జరగడమే కాకుండా చాలా తక్కువగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగాయి. 

 రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించడంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. ఆ మరుసటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. సభ్యులు బడ్జెట్ పత్రాలను అధ్యయనం చేయడం కోసం ఫిబ్రవరి 11న ఉభయ సభలు వాయిదా పడ్డంతో బడ్జెట్ సమావేశాల తొలి భాగం ముగిసింది.

నెల రోజుల విరామం తర్వాత మార్చి 14న పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ఆమోదానికి సంబంధించిన ప్రక్రియతో పాటుగా ఢిల్లీ మున్సిల్ కార్పొరేషన్ సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు లాంటి కీలక బిల్లులు ఆమోదం పొందడంతో గడువుకన్నా ఒక రోజు ముందే బడ్జెట్ స మావేశాలు ముగిశాయి. 

17వ లోక్‌సభ ఎనిమిదో సమావేశం మొత్తం ఉత్పాదకత 129 శాతంగా ఉందని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సభ 27 రోజులు సమావేశమయినట్లు ఆయన చెప్పారు. మరోవైపు రాజ్యసభ గందరగోళం, బలవంతపు వాయిదాల కారణంగా దాదాపు తొమ్మిదిన్నర గంటల సమయాన్ని కోల్పోయింది.

అయితే తొమ్మిది గంటల 16 నిమిషాల పాటు అదనంగా సమావేశం కావడం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. ‘బడ్జెట్ సమావేశాల ఉత్పాదకత 99.8 శాతంగా ఉంది. సభ గనుక మరో 10 నిమిషాలు పనిచేసి ఉంటే ఉత్పాదకత వంద శాతంగా ఉండేది’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.

 లోక్‌సభ ఆర్థిక బిల్లు సహా 12 బిల్లులను ఆమోదించింది. వీటిలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల సవరణ బిల్లు లాంటి కీలక బి ల్లులు ఉన్నాయి. రాజ్యసభ ఆరు అనుబంధ పద్దులు, లోక్‌సభ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లులతో కలిపి 11 బిల్లులను ఆమోదించింది. లోక్‌సభలో వాతావరణ మార్పు, ఉక్రెయిన్‌లో పరిస్థితి, దేశంలో క్రీడలకు ప్రోత్సాహం అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి.