ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా  తెలిపారు. రాజ్యసభలోనూ బీజేపీ 100 సీట్ల మార్క్ దాటిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా లేడని గుర్తు చేశారు. 

బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో  జేపీ నడ్డా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని  ప్రారంభించారు. కార్యకర్తలు రక్త దానం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని కరోల్‌ బాఘ్ శోభాయాత్ర నిర్వహించారు. 

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ బీజేపీ పేదల పార్టీ అని చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.  కొన్ని పార్టీలు.. కుల, మతాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని నడ్డా విమర్శించారు. బీజేపీ మాత్రమే జాతీయవాద రాజకీయాలు చేస్తోందని, అధికారం కంటే దేశ హితమే తమకు ముఖ్యమని చెప్పారు. 

కుటుంబ రాజకీయాలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు వారి వారసుల ఎదుగుదల తప్ప ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోవని మండిపడ్డారు. అలాంటి పార్టీలను పూర్తిగా ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.