టీటీవీ దినకరన్‌కు ఈడీ నోటీసులు

మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరెక్టరేట్ నోటీసులు పంపింది. వీకే శశికళ వర్గానికి ‘రెండు ఆకులు’ గుర్తు సంపాదించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వచూపారనే ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. 
 
ఇదే కేసులో అరెస్టు చేసిన సుఖేష్ చంద్రశేఖర్ అనే మరో వ్యక్తి స్టేట్‌మెంట్‌ను ఈడీ ఈ నెల మొదట్లోనే రికార్డు చేసింది. దర్యాప్తును మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఇప్పుడు దినకరన్‌ను కూడా ఈడీ ప్రశ్నించేందుకు నోటీసులిచ్చింది. 
 
ఈ నెల 8వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలని దినకరన్‌కు ఇచ్చిన నోటీసులో ఈడీ పేర్కొంది. పీఎంఎల్ఏ కింద ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది. చంద్రశేఖర్‌ను 2017లో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండగా ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడులోని ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ‘రెండు ఆకులు’ గుర్తు శశికళ వర్గానికి వచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం ఈసీ అధికారులకు ముడుపులు ఇచ్చేందుకు దినకరన్ నుంచి చంద్రశేఖర్ డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణ.  దీనిపై నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన అనంతరం దినకరన్‌ను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, చార్జిషీటు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత మృతి కారణంగా ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
రెండాకుల గుర్తు కోసం అటు మాజీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం, ఇటు శశికళ వర్గం క్లెయిమ్ చేయడంతో ఆ గుర్తును ఈసీ స్తంభింపచేసింది. అన్నాడీఎంకేకు అప్పట్లో కోశాధికారిగా ఉన్న దినకరన్‌ను, జయలలిత సన్నిహితురాలైన శశికళను 2017 ఆగస్టులో పార్టీ నుంచి అన్నాడీఎంకే బహిష్కరించింది. అనంతరం దినకరన్ సొంతంగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అనే పార్టీని ఏర్పాటు చేశారు