మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్టు

అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ను సీబీఐ బుధవారం అరెస్టుచేసింది. స్థానిక జేజే ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్‌ ఆయనను ప్రత్యేక న్యాయమూర్తి వీసీ బార్డే ఎదుట సీబీఐ బుధవారం హాజరుపరిచింది. కేసు విచారించిన న్యాయమూర్తి.. ఈనెల 11 వరకు దేశ్‌ముఖ్‌ను సీబీఐ కస్టడీలోకి ఇస్తున్నట్టు ఆదేశాలు జారీచేశారు. 
 
అంతకుముందు దేశ్‌ముఖ్‌ వ్యక్తిగత కార్యదర్శి కుందన్‌ షిండే, కార్యదర్శి సంజీవ్‌ పలాండేను కేంద్ర దర్యాప్తు సంస్థ  కస్టడీలోకి తీసుకుంది. మరోవైపు, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వజేను డిస్మిస్‌ చేసింది.  కాగా, అవినీతి కేసులో తన కస్టడీని కోరుతూ సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడాన్ని దేశ్‌ముఖ్‌ బాంబే హైకోర్టులో సవాల్‌ చేశారు. అయితే ఆయన  పిటిషన్‌ను స్వీకరించేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించింది. 
 
కాగా, అంతకుముందు దేశ్‌ముఖ్‌ పిటిషన్‌ను విచారించబోమంటూ బెంచ్‌ నుంచి జస్టిస్‌ రేవతి మొహితే దెరె తప్పుకున్నారు. ఆ తర్వాత దేశ్‌ముఖ్‌ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలంటూ ఆయన తరపు లాయర్‌ అనికేత్‌ నికమ్‌… జస్టిస్‌  పీడీ నాయక్‌ను అభ్యర్థించారు. 
 
ఆయన కూడా పిటిషన్‌ను విచారణ జరిపేందుకు ఆసక్తి చూపించక తప్పుకున్నారు. అయితే తాము ఎందుకు బెంచ్‌ నుంచి తప్పుకున్నారో ఇద్దరు న్యాయమూర్తులూ కారణాలను వెల్లడించలేదు. కాగా, సీబీఐ కేసులో ఇద్దరు నిందితుల ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.