శ్రీ లంకలో ఎమర్జెన్సీపై ప్రతిపక్షాల నిరసన

దేశంలో అత్యయిక పరిస్థితి విధింపుపై శ్రీలంక ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆదివారం పలు ప్రాంతాలలో ప్రదర్శనలు చేపట్టాయి. దేశంలో పశ్చిమ ప్రాంతం ఇతర చోట్ల మొత్తం వేయి మంది వరకూ అరెస్టు అయ్యారు.  ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, సరుకుల కొరతతో రగిలిపోతున్న జనం ఇటీవలే దేశాధ్యక్షులు గొటాబయ నివాసాన్ని ముట్టడించారు. దీనిని తీవ్రంగా పరిగణించి ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశంలో 36 గంటల కర్ఫూ విధించారు. 
 
దీనిని వ్యతిరేకిస్తూ శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం అయిన సమాగి బలవెగయ(ఎస్‌జెబి) పార్టీ ఆదివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ప్రతిపక్షాలు ఆదివారం తమ నాయకులు సజిత్ ప్రేమదాస ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ స్కేర్ వైపు ప్రదర్శనకు దిగాయి. సామాజిక మాధ్యమ వాదులు, హక్కుల నేతలు కూడా ప్రతిపక్ష నిరసనలలో పాల్గొన్నారు.
 
మరో వైపు దేశంలో ఎమర్జెన్సీ, కర్ఫూ విధింపు పరిణామాలపై శ్రీలంక జాతీయులు సామాజిక మాధ్యమం ద్వారా స్పందనలు వెలువరించలేకపోయారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతర మాధ్యమాలను తాత్కాలికంగా నిలిపివేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది.
 
దీనితో సోషల్ మీడియా స్పందనలకు బ్రేక్ పడింది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము ఉద్యమిస్తామని ప్రతిపక్ష లెజిస్లేటర్ హర్ష డిసిల్వా ప్రకటించారు. నిరసనలు చేపట్టామని అన్నారు. అణచివేతలను నిలిపివేయాలి, ఎమర్జెన్సీని ఎత్తివేయాలని నినాదాలకు దిగారు, గోటా ఇంటికి వెళ్లిపో అంటూ దేశాధ్యక్షుడిపై నిరసన వ్యక్తం చేశారు. 
 
దీనితో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ముందుకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అరెస్టులు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే పోలీసులు దాదాపు వేయి మందిని అదుపులోకి తీసుకున్నారు.  దేశంలో సోమవారం ఉదయం వరకూ విధించిన కర్ఫూ కట్టుదిట్టంగా సాగుతోంది. నిరసనకారులు కొందరు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఒకేచోట గుమికూడారని వీరిని అదుపులోకి తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి.

దేశంలో కర్ఫూ, ఎమర్జెన్సీ పట్ల నిరసనగా కాండీ నగరంలో వేలాది మంది విద్యార్థులు ప్రదర్శనలకు దిగారు. వీరు పెరడెనియా వెలుపల గుమికూడారు. వీరిని చెదరగొట్టేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనితో పోలీసులు భాష్ఫవాయువు ప్రయోగించారు. వాటర్‌ క్యానన్లు వాడారు. దీనితో ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.