కేంద్రం నిధులతో జగన్ సొంత డబ్బా!

కేంద్రం ఇచ్చిన సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి  సొంత డబ్బ కొట్టుకొంటున్నారని బిజెపి ఆరోపించింది. ఆస్పత్రి వ్యవస్థల రూపురేఖలు మార్చివేసి సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి డాంబికాలు పలుకుతున్నారని బిజెపి విమర్శించింది.

వాహనాల నిర్వహణ, మహిళలకు నగదు సహాయంలాంటివి కేంద్ర ప్రభుత్వ సహాయంతో జరుగుతున్నప్పుడు.. పేరు మార్చి వైఎస్సార్‌ తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌ అంటూ జగన్‌ సొంత డబ్బ వాయించుకోవడం ఏంటని బిజెపి ప్రశ్నిస్తోంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన పేరుతో తల్లికి విశ్రాంతి సమయంలో కేంద్రం రూ. 5,000 ఇస్తోంది. ఈ రూ. 5,000లకు జగన్‌ ప్రభుత్వం ఒక్క పైసా కూడా జోడించడంలేదని స్పష్టం చేసింది. 
 
సొమ్ము మొత్తం కేంద్రం ఇస్తుంటే.. జగన్‌ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని బిజెపి మండిపడుతోంది. కాగా గర్భిణులు, బాలింతల కోసం వైఎస్సార్‌ తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డాక్టర్‌ వైయస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల్లో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను శుక్రవారం విజయవాడ బెంజి సర్కిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి   ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మొట్టమొదట నుంచి తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 108కి ఫోన్‌ చేసిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి గర్భవతుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు అందించి, డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు కూడా వారి అందజేస్తున్నట్లు చెప్పారు.
ఇంటికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, సిజేరియన్‌ అయితే రూ.3వేలు, సహజ ప్రసవం అయితే రూ.5వేలు ఆరోగ్యఆసరా కింద విశ్రాంతి సమయంలో కూడా తోడుగా ఉండేందుకు ఈ మొత్తాన్ని అందజేస్తున్నామన్నారు. ఆమెను క్షేమంగా ఇంటి వద్ద దింపేందుకు తల్లీబిడ్డ ఎయిర్‌ కండిషన్డు వాహనాలకు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.  తల్లీ బిడ్డా వాహనాలు శ్రీరామరక్షగా ఉంటాయని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.