ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం

పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం లేని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోస్టల్‌ శాఖతో కలిసి పోస్టాపీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు 2017లోనే ప్రకటించినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు.

రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో ప్రస్తుతం మొత్తం 521 పాస్‌పోర్ట్‌ కేంద్రాలు పని చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 93 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు, 428 పోస్టాఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో 24 పార్లమెంటరీ నియోజకవర్గాలకు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు లేదా పోస్ట్‌ ఆఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలో తిరుపతి, విజయవాడలోను, విశాఖపట్నం రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలో విశాఖపట్నం, భీమవరంలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.