చమురు అమ్మకాల్లో భారత్ కు రష్యా భారీ రాయితీ!

చమురు అమ్మకాల్లో భారీ రాయితీని భారత దేశానికి రష్యా ఇవ్వజూపుతోందని తెలిపింది.  ఒక్కొక్క బ్యారెల్‌ 35 డాలర్ల చొప్పున విక్రయిస్తామని తెలిపింది. మొదటి లావాదేవీలో 15 మిలియన్ బ్యారెళ్ళ హైగ్రేడ్ ఆయిల్‌ను కొనాలని కోరుతోంది. 

అంతర్జాతీయ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ధర బ్యారెల్‌కు 45 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలకు చమురు అమ్మకాలు బాగా తగ్గడంతో రష్యా ఈ ఆఫర్‌ను భారత దేశానికి ఇచ్చిందని ఓ వార్తా సంస్థ తెలిపింది.

మరోవైపు చెల్లింపుల కోసం రూపాయి-రూబుల్ డినామినేషన్‌ను వినియోగించేందుకు అవకాశం కల్పిస్తామని రష్యా చెప్పింది. రష్యాకు చెందిన మెసేజింగ్ సిస్టమ్ ఎస్ పి ఎఫ్ ఎస్   ద్వారా చెల్లింపులు జరపవచ్చునని తెలిపింది. దీనివల్ల వ్యాపారం చేయడం భారత దేశానికి మరింత ఆకర్షణీయమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించిన నేపథ్యంలో పేమెంట్స్ సిస్టమ్  స్విఫ్ట్  విధానం నుంచి రష్యాను నిషేధించిన సంగతి తెలిసిందే.  భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ గురువారం న్యూఢిల్లీలో చర్చలు జరిపిన సందర్భంగా రష్యా నుంచి రాయితీ ధరకు చమురును కొనడాన్ని జైశంకర్ గట్టిగా సమర్థించారు.

భారత్ చర్యను అమెరికా, బ్రిటన్ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. రష్యా తమకు అమ్ముతున్నదానికన్నా ఎక్కువ చమురును యూరోపియన్ దేశాలకే అమ్ముతోందని, దేశీయ గిరాకీకి అనుగుణంగా చమురును కొనడానికి అన్ని కాంపిటీటివ్ ఆఫర్స్‌ను స్వాగతిస్తామని భారత్ తెలిపింది. ధరలు పెరిగినపుడు, దేశాలు తమ ప్రజలకు ఉత్తమ లావాదేవీల కోసం చూడటం సహజమేనని జైశంకర్ చెప్పారు.

యూరోపియన్ దేశాలు ఫిబ్రవరిలో కన్నా 15 శాతం ఎక్కువగా మార్చిలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకున్నాయనే వార్తలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే  దేశాల్లో ప్రపంచంలో భారత దేశం మూడో స్థానంలో ఉందని, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటోందని, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కేవలం  1 శాతం కన్నా తక్కువేనని తెలిపారు.

భారత దేశం తనకు అవసరమైన చమురులో దాదాపు 85 శాతం వరకు దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. అప్పటి నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి