ఇక ఎలక్ట్రానిక్ పద్దతిలో `సుప్రీం’ ఉత్తర్వుల బట్వాడా!

సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో త్వరగా, భద్రంగా ట్రాన్స్‌మిట్ చేయడానికి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ గురువారం ఆవిష్కరించారు. 

ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ (ఫాస్టర్) పేరుతో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్, హేమంత్ గుప్తా, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, జబ్జీలు పాల్గొన్నారు. 

ఎన్‌ఐసితో కలిసి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ యుద్ధ ప్రాతిపదికన ఈ ఫాస్టర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిందని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్‌వి రమణ చెప్పారు. ఈ సిస్టమ్ ద్వారా దేశంలోని అన్ని జిల్లాలకు దగ్గరయ్యేందుకు వివిధ స్థాయిలలో 73 మంది నోడల్ అధికారులను నియమించామని, జెసిఎన్ అనే ప్రత్యేకమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ద్వారా నోడల్ అధికారులందరూ అనుసంధానం చేయబడ్డారని ఆయన తెలిపారు.

దీని కోసం దేశవ్యాప్తంగా మొత్తం 1,887 ఇమెయిల్ ఐడిలను సృష్టించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ‘ఫాస్టర్’ సెల్‌ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిందితుల బెయిల్, విడుదలకు సంబంధించిన అన్ని ఉత్తర్వులను ఈ సెల్ ఇమెయిల్ ద్వారా సంబంధిత నోడల్ అధికారులకు, డ్యూటీ హోల్డర్లకు పంపిస్తుందని ఆయన చెప్పారు. 

ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు అన్ని రికార్డులను ఈ వ్యవస్థ ద్వారా పంపించగలుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. 

బెయిలు మంజూరు చేసినప్పటికీ నిందితులను విడుదల చేయడంలో వివిధ కారణాల వల్ల విపరీతమైన జాప్యం జరుగుతోందన్న ఫిర్యాదును జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని బెంచ్ సూమోటోగా విచారణకు స్వీకరించిన తర్వాత ఈ జాప్యాన్ని నివారించడం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.