72 మంది రాజ్యసభ సభ్యులకు ఘనంగా వీడ్కోలు 

రాజ్యసభలో పదవీకాలం ముగియనున్న 72 మంది సభ్యులకు గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. మార్చి – జులై మధ్య పదవీ విరమణ పొందనున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ సభాపతి ఎం వెంకయ్యనాయుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 

ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌, ఇతర సభా కార్యకలాపాలను ఈ సందర్భంగా రద్దు చేశారు. రోజంతా సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి. పదవీ విరమణ పొందనున్న 72 మంది సభ్యుల్లో 69 మంది 19 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా..ఏడుగురు నామినేటెడ్‌ సభ్యులుగా ఉనాురు. వీరిలో 9 మంది మహిళలున్నారు. 

నలుగురు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌, ఐదుగురు రాజ్యసభ పక్షనేతలు ప్రసన్న ఆచార్య (బిజెడి), సంజరు రౌత్‌ (శివసేన), సతీష్‌ చంద్ర మిశ్రా (బిఎస్‌పి), భల్వేంద్ర సింగ్‌ బుందల్‌ (ఎస్‌ఎడి), విజయసాయి రెడ్డి (వైసిపి) పదవి కాలం ముగియనుండటం విశేషం. 

రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లుగా ఉన్న 8 మంది కూడా వీరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్న వారిలో సుజనా చౌదరి, విజయసాయి రెడ్డి, టిజి వెంకటేష్‌, సురేష్‌ ప్రభు, డి. శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మికాంతరావు ఉన్నారు.

 ఏప్రిల్‌లో ఆనంద్‌ శర్మ, ఏకె ఆంటోనీ, సుబ్రహ్మణ్య స్వామి, మేరీకోమ్‌, స్వపన్‌ దాస్‌ గుప్తా పదవీ విరమణ పొందనునాురు. జూన్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, సురేశ్‌ ప్రభు, ఎంజె అక్బర్‌, జైరాం రమేశ్‌, వివేక్‌ టంకా, విజరు సాయి రెడ్డి పదవీ కాలం ముగియనుంది. 

జులైలో కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం. అంబికా సోని, కపిల్‌ సిబల్‌, సంజరు రౌత్‌, ప్రఫుల్‌ పటేల్‌ తదితర నేతలు విరమణ చేయనున్నారు.

రాజ్యసభకు విలువైన, అనుభవశీలురైన సభ్యులు దూరమౌతున్నారని రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. 27 మంది రెండు పర్యాయాలకు మించి సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సభ వారి అనుభవం కోల్పోతుందని పేర్కొన్నారు.

 దేశవ్యాప్తంగా చట్టసభల సభ్యులు తమ బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు కోరారు. పట్టుదల, పనితీరు, సభాకార్యక్రమాలపై సమగ్రత అత్యవసరం చెబుతూ  సభా కార్యకలాపాల విచ్ఛిత్తికి పాల్పడే తత్వం మంచిది కాదని హితవు పలికారు. 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యులు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటూ తమ ముందుకు వచ్చిన చట్టాలు, పాలసీలలో ప్రజల సంక్షేమం మిళితం అయ్యేలా చూడాల్సి ఉందని సూచించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  మాట్లాడుతూ ‘మీ అనుభవాలను దేశం నలుమూలకు తీసుకెళ్లండి. కొన్నిసార్లు చదువు కంటే అనుభవానికే ఎక్కువ శక్తి ఉంటుంది’ అని చెప్పారు. ‘స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎందరో మహానుభావులు తమ విజ్ఞానాన్ని మనకు పంచిపెట్టారు. ఇప్పుడు అది మన బాధ్యత. ఒక సభ్యుడిగా పొందిన అనుభవాన్ని.. దేశం నలుదిశలా వ్యాప్తి చేయండి’ అని  ఆయన కోరారు. పదవీ కాలం ముగిసి వెళ్లిపోతున్న సభ్యులు మళ్లీ రావాలనికోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.