‘సంజీవని ఏ జర్నీ’ డాక్యుమెంటరీని వీక్షించిన ఉపరాష్ట్రపతి

సమాజంలోని వివిధ అంశాలపై చైతన్యం కల్పిస్తూ ప్రజా ఉద్యమాలు తీసుకురావడంలో మీడియా సంస్థలు కీలకమైన పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కరోనానంతర పరిస్థితుల్లో టీకా తీసుకోవాల్సిన అవసరం, ఇప్పటికీ టీకా విషయంలో నెలకొన్న సందిగ్ధత, అనుమానాలను నివృత్తి చేసే లక్ష్యంతో నెట్ వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సంజీవని: ఏ జర్నీ’ ఉద్యమాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీని ఉపరాష్ట్రపతి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీకా తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వివిధ ఆరోగ్య సమస్యలనుంచి మన ప్రాణాలను కాపాడటంలో టీకాలు పోషించే పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రజాఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఉద్యోగులతోపాటు బాధ్యత గల పౌరులందరి సహకారంతోనే భారతదేశం 183 కోట్ల టీకాకరణ పూర్తి చేసుకుందన్న ఉపరాష్ట్రపతి ఇంతవరకు టీకాలు వేసుకోని వారు ఎలాంటి అనుమానాల్లేకుండా టీకాలు తీసుకోవాలని సూచించారు.
జీవితంలో మనమెంత విజయవంతం అవుతామనే విషయాన్ని పక్కనపెడితే, మన చుట్టుపక్కల ఉన్నవారిని చైతన్యపరచడంలో ఎంతవరకు మన పాత్ర ఉంటుందనేదే మన జీవితానికి సరైన అర్థాన్నిస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు తాము సంపాదించిన దాన్ని సమాజంతో పంచుకోవడానికి, సమాజానికి తిరిగి ఇవ్వడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ఓ చక్కటి అవకాశమని వెంకయ్య నాయుడు తెలిపారు.
ప్రజల జీవితాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించేందుకు ఇదొక మంచి సందర్భమని చెబుతూ  సీఎస్ఆర్ కార్యక్రమాలను సేవా కార్యక్రమాలుగా కాకుండా బాధ్యతగా చూసినప్పుడే సత్ఫలితాలను చూడగలమని ఆకాంక్షించారు.