దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల మధ్య సహకారం కీలకం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ సంబంధాల్లో స్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తిందని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారం, మరీ ముఖ్యంగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల మధ్య సహకారం ముఖ్యమైన అంశంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బీమ్స్టెక్   వర్చువల్ సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. 

బీమ్స్టెక్ లో  భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్ ఉన్నాయి.  ఈ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, యూరోపులో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయ సంబంధాల్లో స్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రాంతీయంగా సహకరించుకోవడానికి గొప్ప ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధాని తెలిపారు. ‘‘మన ప్రాంతం ఆర్థిక, ఆరోగ్య భద్రత సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పుడు అవసరమైనవి ఐకమత్యం, సహకారం’’ అని చెప్పారు. ప్రాంతీయ కూటమి సామర్థ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది” అని ప్రధాని సూచించారు.
ఈ  దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని పెంచుకోవడం కోసం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం చాలా ముఖ్యమైనదని ప్రధాని స్పష్టం చేశారు. అనుసంధానం, సౌభాగ్యం, భద్రతల వారధిగా బంగాళాఖాతాన్ని తీర్చిదిద్దవలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ప్రధాని  చెప్పారు.
బీమ్స్టెక్   దేశాలన్నీ కలిసి 1997లో సాధించిన లక్ష్యాలను మళ్ళీ సాధించడం కోసం నూతనోత్సాహంతో పని చేయడానికి అంకితమవాలని ఆయన పిలుపునిచ్చారు.