యునెస్కో ప్రపచ వారసత్వ కట్టడంగా లేపాక్షి 

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడం లేపాక్షికి మరో అరుదైన గుర్తింపు లభించింది. శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షికి ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో గుర్తింపు లభించింది. 
 
దేశంలో 40 ప్రదేశాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా.. అందులో ఈ లేపాక్షి కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక చారిత్రాత్మక కట్టడం కావడం విశేషం. త్వరలో యునెస్కో బృందం ఆలయాన్ని సందర్శించి శాశ్వత జాబితాలో చోటుకు పరిశీలిస్తుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
 
విజయ నగర రాజుల శిల్పకళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన లేపాక్షి వీర భద్రస్వామి ఆలయంలో ఏకశిల నంది విగ్రహం అతిపెద్దది. ఈ విగ్రహం 27 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు ఉంది. ఇక్కడి స్థంభాలపై చెక్కిన కళాకృతులు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి. 
 
విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ క్రీ.శ 1522 నుండి క్రీ.శ. 1538 మధ్యలో ఏడు ప్రాకారాలతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో 878 రాతి స్థంభాలున్నాయి. 246 స్థంభాలపై అబ్బురపరిచే శిల్ప కళాకృతులను తీర్చిదిద్దారు.