ఏప్రిల్ 4న ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9గం.05ని నుంచి 9గం.45ని.మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర పడింది. 

26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్‌గా ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి. 

పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్‌, గుంతకల్‌, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.

ఏప్రిల్‌ 6వ తేదీన వాలంటీర్ల సేవలకు సత్కారంతో పాటు ఏప్రిల్‌ 8వ వసతి దీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. తొలుత కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు నివేదించారు. వారితో జిల్లాల ఏర్పాటు గురించి ఆయన సమీక్ష జరిపారు.

కొత్తజిల్లాలకు సంబంధించి ప్రజలనుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని,  ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామని, ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారని అధికారులు వివరించారు. 

సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామని,  వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనాయంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశామని స్పష్టం చేశారు.

కొత్తజిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక చెక్‌లిస్టు కూడా తయారుచేశామని తెలిపారు. కొత్త జిల్లాలకు సంబంధించి నూతన వెబ్‌సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని చెప్పారు. 

అలాగే కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్‌ బుక్స్‌ కూడా తయారు చేసినట్టు అధికారులు వెల్లడించారు.  కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశామని, సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నామని వివరించారు.

కొత్త జిల్లాలు: పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడలను కొత్త జిల్లాలుగా ప్రకటించారు. 

రెవెన్యూ డివిజన్లు: కుప్పం, పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అలాగే బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తిలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.