హింస ద్వారా బిజెపి అధికారం కోరుకోవడం లేదు 

బిజెపి తన సిద్ధాంతాలు, కార్యక్రమాలు, నాయకత్వం ప్రజాదరణ,  ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రతిచోటా ఎన్నికలలో పోరాడి గెలవాలని కోరుకుంటుందని, కానీ తన  ప్రత్యర్థులపై హింసను ప్రయోగించడం ద్వారా కాదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, 2022పై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ టిఎంసి ఎంపీ సౌగతా రాయ్ షా వ్యాఖ్యలకు స్పష్టమైన ప్రతిస్పందనగా, “మీరు గోవాకు ఎందుకు వెళ్లారు? మీరు త్రిపురకు ఎందుకు వెళ్తున్నారు? మీకు వెళ్ళే హక్కు ఉంది. నేను వెళ్లవద్దు అని చెప్పను. ప్రతి పార్టీ వెళ్లాలి. తమ భావజాలం, కార్యక్రమాలు, అన్ని ప్రదేశాలకు వివరించాలి. ఇదే  ప్రజాస్వామ్యానికి అందం” అని తెలిపారు.

“ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను చంపడం ద్వారా, వరుస హత్యలు చేయడం ద్వారా, (ప్రత్యర్థి) పార్టీ కార్యకర్తల భార్యలు, కుమార్తెలపై అత్యాచారం చేయడం ద్వారా మేము అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవడం లేదు. ఇది మన సంస్కృతి కాదు,” అని కేంద్ర మంత్రి బీర్భూమ్‌ను ప్రస్తావిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో హత్యలు, రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసలను పరోక్షంగా గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, టీఎంసీలు కుటుంబాల కోసం నడిచే పార్టీలని, ఏళ్ల తరబడి అంతర్గత ఎన్నికలు నిర్వహించవద్దని షా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. “మొదట మీ పార్టీలో ఎన్నికలు నిర్వహించండి, తర్వాత దేశం గురించి మాట్లాడండి” అంటూ అమిత్ షా హితవు చెప్పారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. దానికి షా బదులిస్తూ, “ఎన్నికల భయంతో ఎన్నికలు (ఎంసీడీ ఎన్నికలు) వాయిదా వేశామని చెబుతున్న వారు భయపడుతున్నారు. మీకు విజయంపై అంత నమ్మకం ఉంటే, మీకు ఇప్పుడు ఎన్నికలు ఎందుకు కావాలి? మీరు మంచి పని చేసి ఉంటే.  మీరు ఆరు నెలల తర్వాత కూడా గెలుస్తారు” అని ఎద్దేవా చేశారు.

తమ పార్టీకి ఎన్నికలంటే భయం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.  ‘ఎన్నికలు భయపడినప్పుడు ఏం చేస్తారో చెబుతాను.. ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఆ వెంటనే ఈ సభలో ఓటు అడిగే హక్కు లేని ప్రధాని దేశంలోని ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు. ఎమర్జెన్సీ విధించింది. అది భయం” అంటూ కాంగ్రెస్ కు చురకలు అంటించారు.