కీవ్ చెర్నీవ్‌ నుంచి రష్యా బలగాలు వెనక్కు!

నెల రోజులకు పైగా భీకర పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ ఇప్పటిలో స్వాధీనంలోకి వచ్చే అవకాశాలు కనిపించక పోవడంతో పాక్షికంగా తమ సేనలను వెనుకకు తీసుకోవడానికి రష్యా అంగీకరించినట్లు తెలుస్తున్నది. రెండు దేశాల మధ్య కొంతకాలంగా జరుగుతున్న శాంతి చర్చలలో ఎటువంటి పురోగతి సాధింపక పోవడంతో, చర్చలలో విశ్వాసం నెలకొనేటట్టు చేయడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. 
 
చర్చల అనంతరం ఉక్రెయిన్‌పై సైనిక కార్యకలాపాల తగ్గింపునకు రష్యా అంగీకరించింది. రాజధాని కీవ్, చెర్నిహివ్ నగరాలనుంచి బలగాల ఉపసంహరణకు క్రెమ్లిన్ అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మంగళవారం దాదాపు మూడు గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌తో చర్చలు అర్థవంతంగా సాగినట్లు చర్చల్లో రష్యా తరఫు బృందాలనికి నాయకత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్‌స్కీ చెప్పారు.
 
 ఉక్రెయిన్ ప్రతిపాదనలను అధ్యక్షుడు పుతిన్ ముందుంచుతామని కూడా ఆయన చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు.‘ ఈ రోజు జరిగిన అర్థవంతమైన చర్చల తర్వాత ఇరుపక్షాలు ఒక ప్రతిపాదనకు అంగీకరించాయి.
 
శాంతి చర్చల్లో విశ్వాసాన్ని పెంచడానికి కీవ్‌, చెర్నీవ్‌ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. పరస్పర విశ్వాసం, తదుపరి చర్చలు జరగడానికి అవసరమైన పరిస్థితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. 
 
రష్యా ప్రతినిధి బృందం మాస్కోకు తిరిగొచ్చిన తర్వాత ఇస్తాంబుల్‌లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత విపులంగా వెల్లడిస్తామని రష్యా జనరల్ స్టాఫ్ ఫోమిన్ చెప్పారు.  యుద్ధం మొదలై నెలరోజులు దాటిపోయిన వేళ.. ఉక్రెయిన్, రష్యా మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. 
 
మంగళవారం తెల్లవారుజామున ఇస్తాంబుల్ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ కూడా దీనికి హాజరయ్యారు.  దీని ప్రకారం ఇరు దేశాల అధ్యక్షులు త్వరలో  సమావేశం అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై చర్చిస్తారు.
ఎంత త్వరగా అవసరమైన రాజీ కుదిరి అంగీకారానికి వస్తామనే దాన్ని బట్టి శాంతి కుదిరే అవకాశాలు అంతగా చేరువవుతాయి అని మెడిన్‌స్కీ చెప్పారు. కాగా ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండడంపై ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు వీలుగా చర్చలు జరగనున్న దృష్టా కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను గణనీయంగా తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని రష్యా డిప్యూటీ రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ చెప్పారు.

ఇదిలా ఉండగా టర్కీలో జరిగిన చర్చల్లో రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేంతగా పురోగతి సాధించినట్లు, ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సమావేశం జరిగేందుకు వీలు కలిగినట్లు చర్చల్లో ఉక్రెయిన్ తరఫు బృందానికి నేతృత్వం వహించిన డేవిడ్ అర్కమియా చెప్పారు. 

కాగా ఉక్రెయిన్‌లో మానవతా పరిస్థితితో పాటుగా ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా డిమాండ్‌పైనా ప్రధానంగా ఈ చర్చల్లో చర్చించినట్లు తెలుస్తోంది.

తమ ప్రాథమిక లక్ష్యాలను ఈ చర్చల ద్వారా సాధిస్తామని రష్యా విదేశాంగమంత్రి సెర్గె లవ్రోవ్‌ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరువర్గాల మధ్య బెలారస్‌, పొలాండ్‌ సరిహద్దుల్లో మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే శాంతి దిశగా ఎలాంటి ముందడుగూ పడలేదు.