కొత్త పాత తేడా లేకుండా పనిచేయాలి… సంతోష్ ఆదేశం 

ఇతర పార్టీల నుండి బిజెపిలోకి  చేరికలుంటాయని స్పష్టం చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి ఎల్ సంతోష్ తాము   నలుగురిమే ఉంటామంటే కుదరదని తెలంగాణలోకి బిజెపి నాయకులకు తేల్చి చెప్పారు. పాత, కొత్త అనే భేదం లేకుండా కలిసి పని చేయాలని ఆయన సూచించారు. పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని చెబుతూ  పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఉండాలని, గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలదేనని స్పష్టం చేశారు. 

మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం కోసం అనుసరించాల్సిన కార్యాచరణను సంతోష్‌ నిర్దేశించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులను హెచ్చరిస్తూ  రాష్ట్ర పార్టీ నాయకులు తక్షణం హైదరాబాద్‌ వదలి తమ సొంత ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లాల్లో ఉండకపోతే రాజీనామా చేయాలని ఆదేశించారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీజేపీదేననే లక్ష్యంతో పని చేయాలని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి సానుకూల వాతావరణం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. సర్కార్ వైఫల్యాలపై, కేసీఆర్ అవినీతి, అక్రమాలపై ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర నేతలు చేసే పోరాటానికి కేంద్ర నాయకత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని, అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణపై జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందనే విషయాన్ని మరువరాదని పేర్కొన్నారు. 

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకతకు సీఎం కేసీఆరే కారణమని, ఆయన ప్రధాన బలహీనత అహంకారమని సంతోష్ విమర్శించారు. అలాంటి అహంకారం పార్టీ నేతల్లో ఉండకూడదని సూచించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని, దాన్ని తిప్పికొట్టాలని చెప్పారు.

పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాజకీయాలు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. గుజరాత్‌లోని ఆయుర్వేద వర్సిటీకి భవిష్యత్తులో అనుబంధ శాఖలు ఏర్పాటు చేస్తే, దానిని హైదరాబాదులో కొనసాగిస్తామని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ  రాష్ట్ర నాయకత్వం ఇచ్చే కార్యక్రమాలకే పరిమితం కాకుండా స్థానిక సమస్యలపైనా పోరాటం చేయాలని చెప్పారు. 

ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, పార్టీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ములుగు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరారు. వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్‌ కుమార్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీటీసీ, ఆదివాసీ నవ నిర్మాణసేన నాయకులు పార్టీలో చేరారు.