చైనాలో అనూహ్యంగా కరోనా… షాంఘైలో లాక్‌డౌన్

ఇటీవలే కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్నామని ప్రపంచ దేశాలు ఊపరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా పుట్టినిళైన చైనాలో తాజాగా కొత్త కరోనా వేరియంట్‌కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చైనా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
కానీ వైరస్‌ విజృంభణ చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే స్థితి  ఏ మాత్రం కనబడటం లేదు. చివరికి   రోజువారీ కరోనా కేసులు మంగళవారం రికార్డు స్థాయిలో 4,477కి పెరగడంతో షాంఘై నగరం తూర్పు భాగంలో నివసించే ప్రజలకు లాక్‌డౌన్ పరిమితులను విధించింది చైనా ప్రభుత్వం.   ఆ ప్రాంత ప్రజలు కేవలం కరోనా  పరీక్ష కోసం మాత్రమే బయటకు రావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకు నివాసితులు బయటకు రావడం, బహిరంగ ప్రదేశాలలో తిరగడం నిషేదమని, కనీసం పెంపుడు జంతువులు కూడా బయటకు రాకూడదని షాంఘై మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారి తెలిపారు.  గతంలో నివాసితులు తమ భవనాల లాబీకి వెళ్లి వారి గుంపుగా బహిరంగ ప్రదేశాల చుట్టూ నడవవచ్చు. తమ పరిసర ప్రాంతాల్లో వైరస్‌ సోకిన వారు లేకపోతే ఆ ప్రాంతంలోనూ నిక్షేపంగా సంచరించవచ్చ.
అయితే కేసులు తగ్గుముఖం పట్టకపోయేసరికి కేవలం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది. కాగా సోమవారం నమోదైన 3,500 నుంచి లాక్‌డౌన్ విధించిన మొదటి రోజు కరోనా  కేసులు 4,477కి పెరిగాయి.