తాలిబన్ల పాలనలో గడ్డం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం లేదు!

ఇప్పటి వరకు మహిళలపై ఆంక్షలు విధిస్తు వచ్చిన ఆఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్ పాలకులు ఇప్పుడు మగవారిపై కూడా తమ జులుం ప్రదర్శించడం ప్రారంభించారు. గడ్డం లేకపోతే మగవారెవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పని సరిగా గడ్డంతో ఉండాలని, షేవ్ చేసుకోరాదని, డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని తాలిబన్ పబ్లిక్ మొరాలిటీ మినిస్ట్రీ హుకుం జారీ చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, కొత్తగా ప్రకటించిన నిబంధనలను పాటిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

ఉద్యోగులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వారంతా తప్పనిసరిగా గడ్డం పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ షేవ్ చేసుకోరాదు. స్థానిక దుస్తులైన పొడవుగానూ, వదులుగానూ ఉండే టాప్, ట్రైజర్, టోపీ లేదా టర్బన్ ధరించాలి. సకాలంలో ప్రార్థనలు చేయాలి. నిబంధనలను పాటించని వారిని ఆఫీసుల్లోకి  అనుమతించక పోవడమే కాకుండా, డ్రస్ కోడ్ పాటించని వారిపై కాల్పులు కూడా జరుపుతారు.

కాగా, తాలిబన్ సర్కార్ తాజా ఆదేశాలపై పబ్లిక్ మొరాలిటీ మినిస్ట్రీ ప్రతినిధి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఇదిలా ఉండగా, తాబిబన్ సర్కార్ గత వారం మహిళల విమాన ప్రయాణాలపై కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. మగతోడు లేకుండా మహిళలు దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎక్కలేరని విమానయాన సంస్థలను ఆదేశించింది.

కరడుగట్టిన ఈ నిర్ణయంపై పాశ్చాత్య దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఐస్లామిక్ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరి హక్కులను తాము గౌరవిస్తామని, భద్రతా కారణాల దృష్ట్యా మహిళల ప్రయాణాలపై కొత్త ఆంక్షలు విధించామని అఫ్ఘాన్ సర్కారు చెబుతోంది.