దినదిన ప్రవర్థమానమౌతున్న జాతీయవాద భావనలు

సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమౌతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు.
శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన నవయుగ భారతి ప్రచురణ  ‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తూ  ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వాదాలు పుట్టినప్పటికీ, సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాదాలు, వాదనలన్నీ మెల్లి మెల్లిగా నీరుగారి, తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్న ఆయన, నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాల మూలాలతో పుట్టిన అనేక సిద్ధాంతాలు జాతీయవాద భావనను విస్మరించిన కారణంగా మెల్లి మెల్లిగా తమ ప్రభను కోల్పోతున్నాయని పేర్కొన్నారు.
మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారం గా పనిచేసి ఎందరో సామజిక కార్యకర్తలను తీర్చిదిద్ది,  పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమేపల్లి సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాము స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత సోమేపల్లి సోమయ్య,బోగాది దుర్గాప్రసాద్ లకు తాను రుణపడి ఉంటానన్న ఉపరాష్ట్రపతి, తాను జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలనని విశ్వసించి, యువకునిగా తనను ప్రోత్సహించి ముందుకు నడిపింది వారేనని తెలిపారు. ఈ ఆవిష్కరణ తనకు వ్యక్తిగతంగా ఓ అవకాశమన్న ఉపరాష్ట్రపతి, ప్రోటోకాల్ ను సైతం పక్కన పెట్టి నిర్వాహకులైన నవయుగ భారతి, హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సాంఘిక జీవనం ఆందోళనలో పడ్డ ప్రతి సందర్భంలోనూ వారు ముందుకు వచ్చారన్న ఆయన, ప్రకృతి బీభత్సాలు జరిగిన సమయంలో సత్వర సహాయం, శాశ్వత ప్రయోజనం అనే ప్రాతిపదికతో ప్రణాళికలు వేసే వారని తెలిపారు.
ఈ తరహా భావజాలం వల్ల సోమయ్యతో పాటు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న తమలాంటి వాళ్ళు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎదుటి వారు చెడు చేసినా సరే, మంచి చేయాలనే ఆలోచనను, సంకల్పాన్ని మాత్రం వదలొద్దు అని సోమయ్య ఉద్బోధించే వారని తెలిపారు.
“నీచుణ్ని జయించాలంటే దానమే మార్గం. అబద్దాలు చెప్పే వాణ్ని సత్యంతోనే జయించాలి. క్రూరుడిని క్షమించే తత్వంతో, ఓర్పుతో లొంగదీయాలి. అలాగే చెడ్డవాణ్ని మంచితనంతోనే జయించాలి.” అన్న మహాభారత అరణ్య పర్వంలోని శ్లోకాన్ని ఉదహరించిన ఉపరాష్ట్రపతి, మన మంచితనాన్ని, గొప్పతనాన్ని పరీక్షించేందుకు ఎదుటి వారు ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని, వాటిని ఎదుర్కొనే స్థితప్రజ్ఞతను సంపాదించాలనేది సోమయ్యమాటని తెలిపారు.
శతాబ్ధాలుగా భారతదేశాన్ని మందుకు నడిపిస్తున్న వసుధైవ కుటుంబ భావనను యువత కాపాడుకోవాలని దిశానిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశ అభివృద్ధికి పాటుపడిన మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది, సమసమాజ స్థాపనకు అవరోధాలుగా నిలుస్తున్న పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, సాంఘిక వివక్షల వంటి దురాచారాలను పారద్రోలేందుకు యువత నడుం బిగించాలని ఆకాంక్షించారు.
ఎందరో మహనీయుల జీవితాలను లాభాపేక్ష రహితంగా అతి తక్కువ మూల్యంతో నవయుగ భారతి పుస్తకాలుగా అందుబాటులోకి తెస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సభ్యుడు భాగయ్య, నవయుగభారతి అధ్యక్షుడు బాలేంద్ర పొట్టూరి, తెలంగాణ ప్రాంత ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, పుస్తక రచయిత కె. శ్యామ్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.