ఐపీఎల్ 15వ సీజన్ నేటి నుండే 

ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15 వ సీజన్‌ నేడే ప్రారంభం కానుంది. క్రికెట్‌లో పొట్టి పార్మాట్‌ అయిన టీ-20 మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం సంసిద్ధమయ్యింది. ఆరంభ వేడుకలతో సందడి చేస్తోంది. గతంలో కరోనా  కారణంగా క్రికెట్‌ స్టేడియం బోసిపోయింది. టీవీ ల ముందు కూర్చొని ఆనందించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలించడంతో స్టేడియానికి వెళ్ళచ్చుననే ఉత్సాహంతో అభిమానులు సంబరపడుతున్నారు.

ఈరోజు రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌-కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. సీఎస్కేకు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కేకేఆర్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వాన్ని వహించనున్నారు.  కోల్‌కతాపై చెన్నైకి మంచి రికార్డు ఉంది. ఈ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచుల్లో చెన్నై, 8 మ్యాచుల్లో కోల్‌కతా విజయాన్ని సాధించాయి. మరో మ్యాచులో ఫలితం తేలలేదు.

గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజయాన్ని కైవసం చేసుకున్న చెన్నై.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో మరో టైటిల్‌ ను లక్ష్యంగా చేసుకుంది. ఈ జట్టులో దాదాపు అంతా పాత ఆటగాళ్లే ఉండటం కలిసొచ్చే అంశం. రుతురాజ్‌ గైక్వాడ్‌, ధోని, అంబటి రాయుడు, మొయిన్‌ అలీ, డ్వేన్‌ బ్రావోలతో జట్టు బలంగా ఉంది. 

 
శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలో తలపడనుంది. వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌, ఆండ్రూ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌ వంటి ఆల్‌ రౌండర్లతో పాటు బౌలింగ్‌లోనూ ఆ జట్టు సమతూకంగా ఉంది.

తాజాగా మెగా టోర్నీలో రెండు కొత్త జట్లు అడుగుపెట్టాయి. మహారాష్ట్రలోని నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో మూడు ముంబైలో ఉండగా, ఒకటి పూణెలో ఉంది.


కరోనా కారణంగా గత సీజన్‌లో ప్రేక్షకులకు మైదానంలో అనుమతి లేకుండా పోయింది. ఈ సారి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో 25 శాతం మందిని మైదానంలోకి అనుమతించేందుకు బిసిసిఐ అంగీకరించింది. ఛీర్‌ గర్ల్స్‌ సందడి చేయనున్నారు. ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో మైదానాలకు మళ్లీ కళ రానుంది.