ఓటర్ల జాబితాతో ఆధార్ అనుసంధానం!

ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేయాలనే విషయమై కేంద్ర న్యాయ శాఖ పరిధిలో ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు.
లోక్‌సభలో శుక్రవారం ప్రశ్న గంటలో ఆయన మాట్లాడుతూ ‘ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానించడం ఒక మార్గం. వీటిని లింక్‌ చేయడం స్వచ్ఛందమే. ఎన్నికల్లో అక్రమాలను నివారించడం; ఓటర్ల జాబితాల్లో పేర్ల పునరుక్తులు లేకుండా చూడడానికి ‘ఒకే దేశం – ఒకే ఓటర్ల జాబితా’ను రూపకల్పన చేయాలనేది మా లక్ష్యం. తద్వారా, ఎన్నికల ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది’’ అని వివరించారు.
ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించడంపై మార్గాలను అన్వేషించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించామని, ఆన్‌లైన్‌ ఓటింగ్‌కు వారిని అనుమతించే అంశంపై పరిశీలించాలని తెలిపామని పేర్కొన్నారు.
కాగా, ఈవీఎంల సోర్స్‌ కోడ్‌ వాటిని తయారు చేసిన కంపెనీలతోనే ఉంటుందా లేక ఎన్నికల కమిషన్‌కు బదలాయిస్తుందా? అని కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ ప్రశ్నించగా రిజుజు ఆసక్తికరమైన జవాబిచ్చారు.
‘‘ఇది జడ్జిల నియామకం వంటిది. జడ్జిలను ప్రభుత్వం నియమిస్తుంది. కానీ, నియామకం జరిగిన తర్వాత జడ్జిలు స్వతంత్రులు. అలాగే, ఈవీఎంలనూ ఎవరూ ప్రశ్నించజాలరు. వాటి విషయంలో ఎవరి జోక్యం ఉండదు కూడా’’ అన్నారు. ఈవీఎంలను ఈసీకి అప్పగించేసిన తర్వాత సదరు కంపెనీ ఎలా నియంత్రిస్తుంది?” అంటూ మంత్రి  ప్రశ్నించారు.