ప్రజా జీవితాలను మార్చడంలో మీడియాదే ప్రధాన పాత్ర

ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీ సుకువెళ్లడంలో, ప్రజా జీవితాలను మార్చడంలో మీడియాదే ప్రధాన పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ  తెలిపారు. ఈ దిశలో సమాచార వ్యవస్థ పత్రికలు, టీవీల ప్రాధాన్యత ఎనలేనిదని కొనియాడారు. మళయాళపు ప్రముఖ దినపత్రిక మాతృభూమి శత వసంత ఉత్సవాలను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభిస్తూ ప్రధాని మోదీ  శుక్రవారం తమ సందేశం వెలువరించారు. 

పత్రికలు ఇతర మీడియాలు ప్రదర్శించే నిర్మాణాత్మక పాత్ర కీలకమైనదని చెబుతూ  తమ ప్రభుత్వం చేపట్టిన యోగా, స్వచ్ఛ భారత్ , బేటీ బచావో బేటి పడావో వంటి పలు పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో మీడియా ప్రధాన భూమికను పోషించిందని ఈ సందర్భంగా ప్రధాని కితాబు ఇచ్చారు. యోగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రజలు మానసిక, శారీరక ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా యోగాభ్యాసానికి దిగుతుని గుర్తు చేశారు. 

దీనిని ఆచరించాలనే ప్రభుత్వ సందేశాన్ని మీడియా అత్యంత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లిందని, దీనిని ఎవరూ కాదనలేరని తెలిపారు. ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభం అయిన మీడియా ద్వారా మరిన్ని అంశాలు విరివిగా వెలుగులోకి రావాల్సి ఉందని ప్రధాని సూచించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మరుగున పడి ఉన్న ఉదంతాలను, దేశం కోసం ప్రాణాలర్పించిన అజ్ఞాత వీరులను ఈ దేశానికి పరిచయం చేయాల్సిన బాధ్యత కీలకంగా మీడియాపై ఉందని చెప్పారు. 

ఏ దేశం పురోగతి సాధించాలన్నా తగు విధమైన సముచిత అత్యుత్తమ పాలసీలను ఖరారు చేసుకోవల్సి ఉంటుంది. ఇదే క్రమంలో వీటి విజయవంతమైన అమలు కేవలం వీటిని ప్రజల వద్దకు సక్రమ రీతిలో తీసుకువెళ్లడంలోనే ఉంటుంది. ఈ క్రమంలో మీడి యా ప్రాణసమాన పాత్ర వహిస్తుందని ప్రధాని తెలిపారు. 

ఓ పరివర్తన సాధించుకోవాలంటే మీడియా పలు సామాజిక వర్గాల చురుకైన పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ఇటీవలి గడిచిన సంవత్సరాలలో మీడియా తగు విధమైన నిర్మాణాత్మక పాత్ర పోషించిన వైనాన్ని తాను గమనించినట్లు ప్రధాని కొనియాడారు. 

పత్రికలతో విద్వేష ప్రచారాలు తగునా?

ఎన్నికలు తరువాతి దశలో మీడియా వ్యవహరిస్తున్న తీరు జర్నలిజపు విలువకు అనుగుణంగా లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. కేరళలో ఎన్నికల దశలో మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.  వారు ఓ పార్టీ తరఫున ప్రచారానికి దిగినట్లుగా పనిచేశారని, ప్రచారానికి జర్నలిజానికి తేడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పట్ల అనసవర ద్వేషం చాటడటం మీడియాకు అలవాటు అయిందని పేర్కొన్నారు.
 
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధిస్తే కొందరు జర్నలిస్టులు ప్రత్యేకించి యుపిలో పరిణామంపై తమ స్పందనలో ఈ విజయంతో ప్రజలకు ఏదో చేటు కల్గిందనే విధంగా వ్యాఖ్యానాలు వెలువరించారని పేర్కొంటూ ఇది దారుణం అని స్పష్టం చేశారు. నిజాలు కాకుండా అభిప్రాయాలు ప్రజలకు వ్యక్తం చేయడం జర్నలిజం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.