25న ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ఈ నెల 25వ తేదీన (వచ్చే శుక్రవారం) ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి బాధ్యతల స్వీకరించే రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.  లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మార్చి 25 సాయంత్రం 4 గంటలకు ఈ వేడుక జరగనుంది.

స్టేడియం 50,000 మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.  శుక్రవారం యోగి నివాసంలో ఘనంగా హోళీ వేడుకలు జరిగాయి. పలువురు నేతలు తరలివచ్చారు. 

403 మంది సభ్యుల యుపి అసెంబ్లీలో బిజెపి ఈసారి 255 స్థానాలను గెల్చుకుంది. మిత్రపక్షాలు మరో 18 సీట్లను దక్కించుకున్నాయి. గత ఎన్నికలలో ఫలితాలతో పోలిస్తే ఇది 43 స్థానాల వరకూ తక్కువ. అయితే ఈసారి ఎన్నికలలో బిజెపికి ఓట్ల శాతం పెరిగింది. 

రాష్ట్రంలో తమ నూతన కేబినెట్ నిర్మాణం గురించి ఇప్పటికే రెండు దఫాలుగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇతర నేతలతో ఢిల్లీలో యోగి చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య సహా పది మంది మంత్రుల ఓటమితో ఈసారి వీరి స్థానంలో కొత్త వారికి స్థానం కల్పిస్తారని స్పష్టం అయింది.

యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా,  అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు,  హాజరు అవుతారని తెలుస్తోంది.