ఐఎఎస్‌లు స్వయంసమృద్ద భారత్ కలలు మరవకండి!

దేశంలో ఐఎఎస్‌లు ఆధునిక, స్వయంసమృద్ద భారత ఆశయాన్ని, కలను విస్మరించరాదని ప్రధాని నరేంద్ర మోదీ  ఉద్భోధించారు. డెహ్రాడూన్ లోని ఐఎఎస్ శిక్షణాధికారులను ఉద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ  21 శతాబ్ధపు లక్షం ఒక్కటే అది నవభారత, స్వయం సమృద్ధి భారతం, ఈ దిశలో పరిపాలనా వ్యవస్థలోని మూల స్తంభాలైన ఐఎఎస్‌లదే కీలక పాత్ర అవుతుందని స్పష్టం చేశారు. 

21 శతాబ్ధాం స్వయం సమృద్ధ భారతం దిశగా అంతా పాటుపడాల్సి ఉందని పేర్కొంటూ ముస్సోరీలోని ఐఎఎస్‌ల శిక్షణా సంస్థ లాల్‌బహద్దూర్ పరిపాలనా జాతీయ సంస్థ వేదిక నుంచి ప్రధాని శిక్షణా ఐఎఎస్‌లతో మాట్లాడారు. భారతదేశం తనకు తానుగా కీలక పాత్ర పోషించడమే కాదు ఈ ప్రపంచానికి తగు మార్గదర్శకంగా, నాయకత్వ బాధ్యతలలో నిలవాల్సి ఉందని ప్రధాని చెప్పారు. 

ఇందుకు దేశం అధునాతనం, అంతకు ముందు స్వయం సమృద్ధం  కావల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ దిశలో ఐఎస్‌ఎస్‌లు మైలురాళ్లు అవుతారని చెబుతూ  వారే భవిష్య భారత నిర్మాణానికి ప్రాతిపదిక అవుతారని ప్రధాని తెలిపారు. ‘మీ దృష్టి మళ్లవద్దు, 21వశతాబ్ధపు లక్ష సాధనకు మీరు దృష్టి సారించాల్సి ఉంద” అని చెప్పారు. పక్కదోవ పట్టడం, లక్షసాధనలో నిర్లక్షం వహించడం జరిగితే అది పొరపాటే అవుతుందని ప్రధాని హెచ్చరించారు. 

సంస్థలో నూతన శిక్షణాధికారుల 75వ స్నాతకోత్సవం నేపథ్యంలో ప్రధాని వారికి కర్తవ్యబోధన చేశారు. కరోనా తరువాత ప్రపంచంలో సరికొత్త వ్యవస్థ నెలకొంటోంది. కరోనా పూర్వపు అనంతరపు శకాలు ఏర్పాటు అయ్యాయి. ఈ ఇప్పటి సరికొత్త ఘట్టంలో మనం అతి పెద్ద పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని తెలిపారు. 

ఇది కేవలం భారత్‌కే కాకుండా యావత్తూ ప్రపంచానికి కీలకం కావల్సి ఉందని చెబుతూ ఇంతకు ముందటి శిక్షణా బృందాలకు ఇప్పటి బృందానికి చాలా తేడా ఉందని ప్రధాని తెలిపారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించుకున్న తరువాత 75 సంవత్సరాలు దశకు చేరుకున్న ఈ ఘనమైన దశలోనే ఇక్కడి బ్యాచ్ అత్యంత కీలకమైన పరిపాలనా బాధ్యతల స్వీకరణకు సమాయత్తం అయిందని కొనియాడారు. 

ఈ విధంగా వీరిది విశిష్టమైన బృందం. దేశానికి స్వాతంత్య్ర శతవసంతాల దశలోనూ ఇప్పటి ఈ వినూత్న యువ ఐఎఎస్‌లు అనుభవజ్ఞులైన కలెక్టర్లుగా ఇతరత్రా బాధ్యతలలో అధికారంలో ఉంటారని ప్రధాని గుర్తు చేశారు.  ఈ విధంగా అత్యంత కీలకమైన రెండు ఘట్టాలను వీరు చవిచూసిన వారవుతారని మోదీ చెప్పారు. 

అధికారంలోకి వచ్చిన తరువాత ఏ దశలోనూ సేవాభావన వీడరాదని, విధుల నిర్వహణలో నిర్లక్షం చూపరాదని ప్రధాని  హితవు పలికారు. కేవలం అధికారం చలాయించడం లేదా తమదే అధికారం అనుకునే ధోరణితోనే వ్యవహరించడం చివరికి వ్యక్తిగతంగానే కాదు సంస్థాగతంగా కూడా హాని కల్గిస్తుందని ప్రధాని హెచ్చరించారు. పరిణామం, పనితీరు, పరివర్తనం కీలక ఘట్టాలుగా ఎంచుకుని ముందుకు సాగాల్సి ఉందని తెలిపారు.

ఎప్పుడూ తరువాతి దశకు చేరుకోవడం అలవర్చుకుంటేనే ఎవరికైనా వికాసం సాధ్యం అవుతుందని ప్రధాని సూచించారు. అధికారులు సమాజంలోని అట్టడుగు వారి జీవన ప్రమాణాల మెరుగుదల గురించి ఆలోచించాలని చెప్పారు. ప్రజలతో మమేకం కావల్సి ఉందని చెబుతూ  క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఈ దిశలో నిర్ణయాలు తీసుకోవడానికి ముందువెనకలకు దిగరాదని తెలిపారు. 

పరిపాలనా క్రమంలో దృష్టిలోకి వచ్చే సమాచారాన్ని ఐఎఎస్‌లు కేవలం ఫైళ్లలోని డాటాగా భావించుకోరాదని, ఇది కేవలం గణాంకాలు లేక లెక్కలని భావించరాదని, ఇవి వ్యక్తుల జీవితాలకు వారి కలలకు సంబంధించినవి అని ప్రధాని తేల్చిచెప్పారు. ఈ కోణంలో వీటి ప్రాధాన్యతలను గమనించి తగు విధంగా ఫైళ్లను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

వ్యవస్థపై అసమగ్రత లేదా సహేతుకతపై అనాసక్తి ఉంటే విద్యుక్త ధర్మం నిర్వహణలో వైఫల్యం ఖాయం అవుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ట్రైనీలను ఉద్దేశించి మాట్లాడటానికి ముందు ప్రధాని మోదీ  అకాడమీ ఆవరణలో ఏర్పాటు అయిన నూతన క్రీడా మైదానానిన హ్యాపీ వ్యాలీ ఔట్‌డోర్ కాంప్లెక్స్ పేరిట ప్రారంభించారు. 

అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లే అధికారులు పదవీ బాధ్యతల ముందు తమ అనుభవాలను, జిల్లా అధికారులుగా తమ లక్షాలను తెలియచేసుకుంటూ వివరణాత్మక పత్రం సమర్పించి వెళ్లితే అది రాబోయే యువ ఐఎఎస్ బ్యాచ్‌లకు ఎంతగానో దొహదంగా ఉంటుందని ప్రధాని సూచించారు.