రాజకీయాల్లో తలదూర్చవద్దు.. బ్రదర్ అనిల్ కు హెచ్చరిక!

ఎన్నికల్లో విజయం కోసం ఎంతో కృషి చేసిన క్రైస్తవులను, ఇతర బడుగు వర్గాలను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు క్రైస్తవ సంఘాలతో కలసి సమాలోచనలు చేస్తుండడంతో జగన్ శిబిరం అప్రమత్తమైన్నట్లు కనిపిస్తున్నది. ఆయనకు మద్దతుగా క్రైస్తవ సంఘాల జెఎసి పేరుతో రాజకీయాలలో తలదూర్చవద్దని బ్రదర్ అనిల్ ను హెచ్చరించారు. 
 ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి సహకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్‌, మైనార్టీ సమస్యలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, తమరైనా చొరవచూపాలని ఒత్తిళ్లు రావడంతో బ్రదర్‌ అనిల్‌ ఏపీలో పర్యటిస్తున్నారు. తిరుపతి, వైజాగ్‌, విజయవాడలో పర్యటించి పలువురు నాయకులతో చర్చించి ప్రభుత్వ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.
 కాగా, పాదయాత్రలో ఇచ్చిన హామీలను పరిష్కరించడంలో జగ‌న్‌ ప్రభుత్వం 3 సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కనీసం చర్చించడానికైనా సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు తిరుపతి, వైజాగ్‌లో బ్రదర్‌ అనిల్‌తో క్రిస్టియన్‌ సంఘాలు సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది. తనకు కూడా జగన్ ను కలవడం సాధ్యం కావడం లేదని వారి వద్ద ఆయన వాపోయినట్లు మీడియా కధనాలు వచ్చాయి.
రాజకీయ పార్టీ పెట్టాలని వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి సూచనలు వస్తున్నాయని, పార్టీ పెట్టడం అంతా ఈజీ కాదని అంటూనే నర్మగర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు అనిల్. అయితే బ్రదర్ అనిల్ పర్యటనలపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ స్పందించింది. ఈ క్రమంలో బుధవారం తిరుపతిలో జేఏసీ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించింది.
బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతాననడం హాస్యాస్పదంగా ఉందని, దైవ సందేశం అందించే బ్రదర్ ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తాడో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరుతో షర్మిల పార్టీ నడిపిస్తున్నారని, బ్రదర్‌ అనిల్‌ మీరు కూడా తెలంగాణలో పార్టీ పనులు చూసుకోవాలని, ఏపీ రాజకీయాల్లో తలదూర్చవద్దని అంటూ పరోక్షంగా హెచ్చరిక సందేశం ఇచ్చారు.