జంగారెడ్డిగూడెం మరణాలపై రగడ.. టిడిపి సభ్యుల సస్పెన్షన్

ఎపి అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ రాజుకుంటోంది.  బుధవారం సభ ప్రారంభమయినప్పటి నుంచి జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చకు టిడిపి ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సమావేశాలు మొదలైనప్పటి నుంచి టిడిపి సభ్యులు నిరసన కొనసాగించారు. 

దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనప్పటికీ టిడిపి ఆందోళన కొనసాగుతుండగా సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారంటూ  11 మంది టిడిపి సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్ బెందాలం, భవాని ఆదిరెడ్డి, చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరరావు, గద్దె రామ్మెహన్, రామకృష్ణబాబు, సాంబశివరావు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు. జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న వరుస మరణాలు నాటుసారా వల్లనే  సంభవిస్తున్నాయని టిడిపి ఆందోళనలు చేపడుతోంది. 

తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జంగారెడ్డిగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటించారు. మరోవైపు ఈ మరణాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. ఇందులో భాగంగానే అసెంబ్లీలో కూడా చర్చకు టిడిపి సభ్యులు పట్టుబడుతున్నారు.

కల్తీ సారా మరణాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సభను తప్పు దారి పట్టించారంటూ.. స్పీకర్‌ పోడియం వద్ద టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని ఈ ఒక్కరోజు సస్పెండ్‌ చేయాలని డిప్యూటీ సిఎం నారాయణ స్వామి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టిడిపి సభ్యులపై నారాయణస్వామి తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

టిడిపి సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. రేపు మీ జాతకాలు బయట పెడతా అంటూ.. హెచ్చరించారు. కాదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని నారాయణస్వామి టిడిపి సభ్యులకు సవాలు విసిరారు.

కాగా,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. కల్తీ సారా మరణాలను సహజమరణాలుగా చిత్రీకరించి సభను, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో సభాహక్కుల నోటీసు ఇచ్చారు.