బిసి సీఎం నినాదంతో బ్రదర్ అనిల్ మరో క్రైస్తవ పార్టీ!

ప్రస్తుతం తన బావగారైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్రైస్తవులకు లభిస్తున్న ప్రాధాన్యత సరిపోవటం లేదన్నట్లు ఆయన బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ `బిసి సీఎం’ నినాదంతో మరో క్రైస్తవ పార్టీని రాష్ట్రంలో ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ క్రైస్తవ  పెద్దలు, క్రైస్తవ సంఘాలతో పాటు క్రైస్తవుల ప్రాధాన్యం గల ఎస్సి,  ఎస్టీ, బిసి సంఘాల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్నారు. 

ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో సమావేశాలు జరిపారు. ఆయన భార్య, జగన్ సోదరి వైఎస్ షర్మిల `వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ని ఏర్పాటు చేసి, తెలంగాణాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆమె దృష్టి అంతా ఏపీ మీద, అన్న నేతృత్వం వహిస్తున్న ప్రభుత్వం మీదనే ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. 

2014లో కడప లేదా ఒంగోలుల నుండి ఎంపీగా పోటీ చేస్తానంటే అన్న ఒప్పుకోలేదు. ఆమెను పోటీ నుండి తప్పించడం కోసమే అమ్మ విజయమ్మను విశాఖపట్నం నుండి పోటీ చేయించి, ఆమె ఓడిపోగానే రాజకీయంగా ఆమెను ఇంటికి పరిమితం చేశారు. 2019 ఎన్నికలలో కూడా సోదరి, అమ్మలకు పోటీ అవకాశం ఇవ్వలేదు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారిద్దరిని దూరంగా ఉంచుతూ వస్తున్నారు. పైగా, ఒకవేళ శిక్షపడి జైలుకు వెళ్ళవలసి వస్తే ముఖ్యమంతి పదవి చేపట్టడం కోసం భార్య వైఎస్ భారతికి అన్నివిధాలా ఇప్పటి నుండే ప్రభుత్వ వ్యవహారాలలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమెకు సన్నిహితులుగా పేరొందినవారే ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలలో కీలక పాత్ర వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేందుకు రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుదామని బ్రదర్‌ అనిల్‌కుమార్‌ పిలుపు ఇవ్వడం గమనిస్తే ఇంట్లో తలెత్తిన ఆధిపత్య పోరాటం వీధులలోకి వస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ‘‘మీరంతా సంఘటితంగా కలిసి వస్తామంటే.. ముందుండి నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని అనిల్‌ ఈ సమావేశాల్లో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 

బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు బదులుగా బలహీన వర్గాల నాయకత్వంలో ప్రత్యామ్నాయం అవసరమని ఈ సమావేశాలలో అనిల్ పేర్కొనడం జగన్ ను దృష్టిలో ఉంచుకొనే అని సర్వత్రా భావిస్తున్నారు.  తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా పార్టీని విస్తరించాలని పలువురు కోరుతున్నారని ఈ సందర్భంగా వెల్లడించడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.

గత ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు వైసీపీ విజయానికి కృషి చేశారని చెబుతూ సీఎం జగన్‌ కానీ, ప్రభుత్వం కానీ ఈ వర్గాల సమస్యలను పట్టించుకోవడం లేదని అనిల్  విమర్శించారు.

ఇటీవల విజయవాడలో ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో ఆయా సంఘాలు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను సీఎం జగన్‌కు వివరించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘‘ఆయన (జగన్‌) పథకాల అమలు బిజీలో ఉన్నట్టున్నారు. నేను నా పనుల్లో తీరిక లేకుండా ఉన్నాను. నేను ఆయన్ను కలిసి రెండున్నరేళ్లు అయ్యింది’’ అని బ్రదర్‌ అనిల్‌ సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా గత ఎన్నికలలో జగన్ గెలుపు కోసం క్రైస్తవులు ఎంతో కష్టపడినట్లు స్పష్టం అవుతున్నది. గత ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ఫోన్‌లు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారని ఈ సమావేశంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిస్టియన్‌ చారిటీ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు గారా హనోక్‌ వెల్లడించారు. ఆయన పిలుపు మేరకు తామంతా వైసీపీ విజయానికి కృషి చేశామన్నారు. టీడీపీకి ఓటేద్దామనుకున్నవారు కూడా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ అన్యాయం చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.