చైనాలో మళ్లీ కరోనా …పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్

కరోనా మహమ్మారి పుట్టిల్లు అయిన చైనా దేశంలో మళ్లీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేసింది. ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది.
హాంకాంగ్‌లోనూ వైరస్‌ విజృంభిస్తున్నది. నగరంలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో నగరాన్ని వీడుతున్నారు.  చైనా దేశంలో మంగళవారం ఒక్కరోజే మునుపటి రోజు కంటే రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కేసులు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే చైనాలో 5,280 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. 
ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్న ‘బి.ఎ.2’ కారణంగా పలు నగరాలు క్రమంగా లాక్‌డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. మంగళవారం చైనా తాజా కోవిడ్ కేసులు అంతకుముందు రోజు కంటే రెండు రెట్లు ఎక్కువ. తాజా 24 గంటల వ్యవధిలో స్థానికంగా 3,507 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.
 “స్టెల్త్ ఓమిక్రాన్” అని పిలువబడే వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్ చైనా యొక్క జీరో-టాలరెన్స్ స్ట్రాటజీని పరీక్షిస్తోంది. కొత్త కేసులు చాలా వరకు ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇక్కడ 2,601 నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, షెన్‌జెన్‌లతో పలు నగరాల్లో వ్యాప్తి అధికంగా ఉంది.
 
చైనా దేశంలోని 18 ప్రావిన్సులలో ఒమైక్రాన్, డెల్టా వేరియెంట్ లతో జనం సతమతమవుతున్నారు. దీంతో షాంఘై నగరంలో అధికారులు పాఠశాలలను మూసివేశారు. షెన్ జెన్ దక్షిణ టెక్ పవర్ హౌస్ తోపాటు ఈశాన్య నగరాల్లోని పరిసరాలను పాక్షికంగా లాక్ చేశారు. జిలిన్ నగరంలో పాక్షికంగా లాక్ డౌన్ చేశారు.
 
ఉత్తర కొరియా సరిహద్దుల్లోని  పట్టణ ప్రాంతమైన యాన్జీలో కరోనా కేసులతో 7 లక్షలమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిలిన్ నగరంలోనే 2,200 కరోనా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
 
చాంగ్ చున్ నగరంతోపాటు మరో మూడు చిన్న నగరాల్లో మార్చి 1వతేదీ నుంచి లాక్ డౌన్ విధించారు.చాంగ్ చున్ హెల్త్ కమిషన్ అధిపతిని ఉద్యోగం నుంచి తొలగించామని సర్కారు తెలిపింది.కరోనా కేసులు పెరిగేకొద్దీ చైనా దేశంలో జాతీయ ఆరోగ్య కమిషన్ యాంటిజెన్ పరీక్షలను ముమ్మరం చేసింది.