బరాక్ ఒబామాకు కరోనా పాజిటివ్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా  పాజిటివ్ అని తేలింది .తనకు కరోనా  పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని, తనకు రెండు రోజులుగా గొంతు నొప్పి ఉందని బరాక్ ఒబామా చెప్పారు. తనకు కరోనా సోకినా బాగానే ఉన్నానని ఒబామా ట్విట్టర్‌లో రాశారు. 
 
‘‘నా భార్య మిచెల్, నేను కరోనా టీకాలు వేయించుకున్నాం. మిచెల్ కు కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మీరు ఇప్పటికే టీకాలు వేయించుకోకుంటే, కరోనా టీకాలు వేయించుకోవాలని కోరుతున్నాను’’ అని బరాక్ ఒబామా కోరారు.
 
కాగా, కరోనా వైరస్ బారిన పడిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బరాక్ ఒబామాను ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.‘‘కరోనా నుంచి మీరు త్వరగా కోలుకోవాలి,మీ కుటుంబం మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 
 
బరాక్ ఒబామాతో నరేంద్రమోదీకి మంచి స్నేహం ఉంది. గతంలో ఒబామా అధ్యక్షుడిగా పనిచేసినపుడు మోదీతో తరచూ మాట్లాడుతుండేవారు. పాత స్నేహం దృష్ట్యా సోమవారం కరోనా సోకిన ఒబామా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు. 
ఇలా  ఉండగా,దేశంలో కరోనా మహమ్మారి కేసులు పూర్తిగా అదుపులోకి వస్తున్నాయి. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2503 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనాతో మరో 27 మంది బాధితులు మరణించారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,377 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,93,494 కు చేరింది.  ఇందులో 4,24,41,449  బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు  5,15,877  మంది బాధితులు మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,19,45,779 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.