ఉక్రెయిన్‌లో భారత ఎంబసీ తాత్కాలికంగా పోలండ్‌కు తరలింపు

ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నందున అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా సమీపంలోని పోలండ్‌కు మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలతో పాటుగా అన్ని నగరాల్లో దాడులు కొనసాగుతున్నాయి. 
 
దీంతో అక్కడి భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిసున్న దృష్టా భారత రాయబార కార్యాలయాన్ని సమీపంలోని పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించాం’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రాబోయే పరిణామాలను బట్టి పరిస్థితులను తిరిగి అంచనా వేయడం జరుగుతుందని ఆ ప్రకటన తెలిపింది.

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్ భూభాగం నుంచి భారతీయులను సురక్షితంగా తరలించే కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 20 వేలమంది భారతీయులను ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం కింద భారత్‌కు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. 

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన అధికారుల్లో చాలా మంది లెవివ్‌లోని క్యాంప్ కార్యాలయంనుంచి ఇప్పటికే పని చేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను భూతల సరిహద్దు క్రాసింగ్‌లగుండా తరలించే కృషిలో భాగంగా లెవివ్‌లో భారత దౌత్యకార్యాలయం క్యాంప్ ఆఫీస్‌ను ఏరాటు చేయడం జరిగింది. లెవివ్ పోలండ్ సరిహద్దుకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సైనిక స్థావరంపై దాడిలో 35 మంది మృతి 

కాగా, : పోలండ్‌ సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్‌ మిలిటరీ స్థావరంపై రష్యన్‌ వైమానిక దళం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడంతో రష్యా, ఉక్రెయిన్‌ ఘర్షణలు పద్దెనిమిదో రోజు ఆదివారం మరింత ఉధృతరూపం దాల్చాయి. తాజా దాడుల్లో 35 మంది దాకా మరణించినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. 

పోలండ్‌ సరిహద్దుకు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్‌ సైనిక శిక్షణా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్‌ సైనికుల కోసం ఉద్దేశించిన విదేశీ ఆయుధ సరఫరాలపై దాడులు చేస్తామని రష్యా ప్రకటించిన మరుసటి రోజే ఈ మిలిటరీ స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో అమెరికా జర్నలిస్టు కూడా ఒకరు మరణించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 

అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళానికి ఉద్దేశించిన కేంద్రాన్ని ఉక్రెయిన్‌ మిలిటరీ సిబ్బంది చాలా కాలంగా తమ స్థావరంగా ఉపయోగించుకుంటోంది. అమెరికా, నాటో దేశాలు సహకారంతోనే ఉక్రెయిన్‌ సైనిక స్థావరంగానే కాకుండా, అంతర్జాతీయ నాటో సైనిక విన్యాసాలకు కూడా వాడుకుంటున్నదని రష్యా ఆరోపించింది.