సింగరేణి ప్రైవేటీకరణపై ఎక్కడైనా చర్చకు ఈటల సవాల్!

సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ విషయంపై అసెంబ్లీలోనైనా, ఇంకెక్కడైనా తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఎంఎస్‌ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ 27వ ద్వైవార్షిక మహాసభలో ఆయన పాల్గొంటూ  సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అని, సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నదని కేసీఆర్ దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో నియంతృత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం దగ్గరలోనే ఉందని ఈటల హెచ్చరించారు. సింగరేణిని ప్రపంచంలోనే గొప్ప సంస్థగా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని పేర్కొన్నారు. 

చైతన్యానికి మారు పేరుగా ఉన్న కార్మిక సంఘాలు సమ్మె చేస్తే ఆ చైతన్యాన్ని చంపేసిన మొట్టమొదటి సీఎం కేసీఆరే అని గుర్తు చేశారు. సింగరేణిలో చైతన్యం మునుపటి లెక్క లేదని, సంఘటితంగా సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితులు పోయాయని విచారం వ్యక్తం చేశారు. సింగరేణి, ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్యతను కేసీఆర్ దెబ్బ తీశారని ఈటల విమర్శించారు. 

సింగరేణి యాజమాన్యం నాలుగు బొగ్గు బ్లాకులు తమకు అవసరం లేదని చెప్పడంతోనే కేంద్రం వేలానికి పెట్టిందని ఈటెల తెలిపారు. తమ వద్ద బొగ్గు  బ్లాకులు ఉన్నందు వల్ల అవసరం లేదని చెప్పారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిందని, ఆ పార్టీ ఎంపీలు దీనిని వ్యతిరేకించలేదని తెలిపారు.

ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో సైతం ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాన మంత్రిని కలిసిన సందర్భాల్లో కూడా బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని చెప్పలేదని గుర్తు చేశారు. అక్కడ వేలానికి మద్దతు ఇస్తూ, ఇక్కడ విష ప్రచారం చేస్తున్నారని ఈటెల ఆరోపించారు.

నైని బ్లాక్‌ బొగ్గు తవ్వకా లను తమ వారికి కట్టబెట్టడం ద్వారా వేల కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగరేణి సీఎండీ తొత్తుగా మారాడని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా తాడిచర్ల బొగ్గు బ్లాకును ప్రైవేటీకరించారని గుర్తు చేశారు.

తాను ఆ సమయంలో అధికార పార్టీలో ఉన్నా కూడా అసెంబ్లీ వేదికగా వ్యతిరేకించానని, తాడిచర్ల బొగ్గు బ్లాకును సింగరేణికి ఇవ్వకుండా ఎవరికి, ఎందుకు అప్పగించారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశానని గుర్తు చేశారు.

సింగరేణిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయంలో ప్రైవేటీకరణ పెరిగిపోయిందని, బొగ్గు తవ్వకాలను ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కాలం చెల్లిందని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేట్‌పరం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని భరోసా ఇచ్చారు.

బొగ్గును ఉత్పత్తి చేసి ఈ దేశానికి వెలుగును అందిస్తున్న సింగరేణి సంస్థకు సీఎం కేసీఆర్ ఇష్టానికి సొంత నిబంధనలు పెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేవనెత్తారని గుర్తు చేశారు. 

కానీ, మొత్తం గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారానికి తెరలేపారని చెప్పారు. ఈ అంశంపై ఎక్కడైనా తాను చర్చకు వచ్చేందుకు సిద్ధమేనని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి, నిజాయతీ లేవని, కార్మికుల కుటుంబాలపై ప్రేమ లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజానీకాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కేసీఆర్ కు బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.