తెలంగాణకు మార్చ్ లో వరుసగా బిజెపి అగ్రనాయకులు 

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు పూర్తవడంతో బిజెపి కేంద్ర నాయకత్వం ఇక తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే పార్టీ అగ్రనాయకులు వరుసగా రెండు రాష్ట్రాలలో పర్యటనలు జరిపి, వివిధ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల పార్టీ నాయకులతో వివిధ స్థాయిలలో సమాలోచనలు జరిపి, దిశానిర్ధేశం చేశారు. 
 
మార్చి చివరి వారంలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ పర్యటనకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మార్చ్ చివరి వారంలోగాని, ఏప్రిల్ మొదటివారంలో గానీ జనగాంలో బిజెపి నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు.
 
ఈ భారీ బహిరంగ సభకు జెపి నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌లు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవంక, వివిధ కారణాల చేత వాయిదా పడుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ కార్యక్రమం మార్చ్ 14 నుండి ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 
 
ఏప్రిల్ 14న జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించే కార్యక్రమానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా హాజరు కాగలరని భావిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు తెలంగాణలో అమిత్‌షా మకాం వేయనున్నారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. 
 
అమిత్‌షా పర్యటన సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరడానికి  రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా నాయకులతో ఇప్పటికే బిజెపి నాయకులు సమాలోచనలు జరుపుతున్నారు.  
 
మరోవంక, క్షేత్రస్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలను కేంద్ర పార్టీ పంపి వివిధ  నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గెలుపు అవకాశాల ఉన్న అభ్యర్థులను కూడా గుర్తించే అవకాశం ఉంది.