కంటోన్మెంట్ కు కేటీఆర్ హెచ్చరికకపై కిషన్, సంజయ్ ఆగ్రహం 

వారు తమ మాట వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తామని, నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోమని అంటూ పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు రాష్త్ర శాసనసభలో తీవ్ర స్థాయిలో హెచ్చరించడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
టీఆర్‌ఎస్‌ పార్టీకి సాయుధ బలగాలను విమర్శించే చరిత్ర ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌.. సైన్యం చైనాకు వెన్నుచూపిందంటారు. కేసీఆర్‌తోపాటు.. ఓ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఆధారాలు అడుగుతారు. ఇప్పుడు కంటోన్మెంట్‌కు పవర్‌, వాటర్‌ కట్‌ అంటూ కేటీఆర్‌ బెదిరిస్తున్నారు’’ అంటూ ఆయన మండిపడ్డారు.
ఈ తరహా వ్యాఖ్యలు కేసీఆర్‌ కు టుంబ అహంకారం, కృతఘ్నతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కంటోన్మెంట్‌ రోడ్ల విషయం సున్నితమైన అంశమని.. రక్షణ సంస్థలు, భద్రతకు సంబంధించిన విషయమని తెలుపుతూ కేటీఆర్‌ది దుర్భరమైన వ్యాఖ్య అని విమర్శించారు. ఆ వ్యాఖ్యలు యావత్‌ రక్షణ సిబ్బందికి అవమానమని స్పష్టం చేశారు.
రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్‌ ఏమైనా కల్వకుంట్ల జాగీరా? అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ హెచ్చరించడం సిగ్గుచేటని విమర్శించారు
‘‘కేటీఆర్‌..! కంటోన్మెంట్‌ మీ అయ్య జాగీరనుకున్నావా? కంటోన్మెంట్‌ను టచ్‌ చేసి చూడు..! మాడి మసైపోతావ్‌..! తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి.. ఉరికిచ్చి కొడతారు. బలుపెక్కి.. బరితెగించి మాట్లాడితే.. చూస్తూ ఊరుకుంటామా?? ఖబడ్దార్‌..!’’ అని బండి సంజయ్‌ హెచ్చరించారు.
భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తక్షణమే రాష్ట్ర ప్రజలకు, భారత సైన్యానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  ఈ అంశంపై బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి, న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతుందని వెల్లడించారు.