ఉక్రెయిన్‌కు అమెరికా 13.6 బిలియన్ల ఆర్థిక ప్యాకేజి

యుద్ధంలో నేరుగా పాల్గొనడం తప్ప ఉక్రెయిన్ ప్రజలకు అన్ని రకాల సాయం అందిస్తామని ప్రతిన బూనిన అమెరికా అందుకు తగ్గట్టే వ్యవహరిస్తోంది. ఆ దేశానికి సైనిక, మానవతా సాయం కింద 13.6 బిలియన్ డాలర్లను అందించనుంది. 
 
ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక ప్యాకేజికి అమెరికా కాంగ్రెస్( పార్లమెంటు) ఆమోదముద్ర వేసింది. ‘పుతిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు ఒంటరి కాబోరని మేము హామీ ఇచ్చాం.ఈ ప్యాకేజిని ఆమోదిస్తే ఆ హామీని నిలబెట్టుకున్న వాళ్లమవుతాం’ అని ఓటింగ్‌కు ముందు సెనేట్ మెజారిటీ నాయకుడు చక్ షుమర్ చెప్పారు. 
 
ఈ ప్యాకేజిలో సగభాగం సైనిక అవసరాలకు ఖర్చు చేస్తారు. మిగిలిన సగభాగాన్ని మానవతా, ఆర్థిక సాయంగా ఉక్రెయిన్‌కు అందిస్తారు. కాంగ్రెస్ ఆమోదించిన ఈ ప్యాకేజికి అధ్యక్షుడు బైడెన్ సంతకం తప్పక లభిస్తుందనేది తెలిసిందే.

ఆంక్షలతో ఐఎస్‌ఎస్ కూలిపోతుంది

కాగా, రష్యాపై పాశ్యాత్య దేశాలు వధిస్తున్న ఆంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కూలిపోవడానికి దారితీయవచ్చని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ హెడ్ దిమిత్రీ రోగోజిన్ హెచ్చరించారు.
 
 ‘ప్రస్తుతం విధిస్తున్న ఆంక్షల కారణంగా ఐఎస్‌ఎస్‌కు రష్యా అందిస్తున్న సేవలకు అంతరాయం కలగవచ్చు. దీంతో ఐఎస్‌ఎస్ కక్షను సరిదిద్దే రష్యన్ విభాగం ప్రభావితం అవుతుంది. ఫలితంగా 500 టన్నుల బరువుండే ఈ నిర్మాణం సముద్రంలో కానీ, భూమిపై కానీ కూలిపోయే ప్రమాదం ఉంది’ అని రోగోజిన్ ఒక ట్వీట్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా,దాని అంతర్జాతీయ భాగసాములను హెచ్చరించారు. 
 
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే రోగోజిన్ ఇదే తరహా హెచ్చరికలు చేశారు. ఐఎస్‌ఎస్ నిర్దేశిత కక్షలో తిరిగేందుకు అవసరమైన ప్రొపల్షన్ సిస్టమ్‌ను అందజేస్తోంది రష్యానే. ఐఎస్‌ఎస్‌లో ముఖ్యంగా రెండు కీలక వ్యవస్థలున్నాయి. అందులో ఒకదాన్ని అమెరికా పర్యవేక్షిస్తుంటే, మరోదాన్ని రష్యా చూస్తోంది. ఈ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్షలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది.
అయితే అంతరిక్ష కేంద్రానికి రష్యా తన సహకారాన్ని ఉపసంహరించుకుంటే తమ కంపెనీ రంగంలోకి దిగుతుందని స్పేస్‌ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో నలుగురు నాసా వ్యోమగాములు, ఇద్దరు రష్యన్ కాస్మొనాట్లు, మరో యూరోపియన్ వ్యోమగామి ఉన్నారు.